బాబుతో ఆయనకేమిటి పని?

January 12, 2017


img

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏమి పని? అంటే ఏమీ లేదనే చెప్పవచ్చు. కానీ ఉందిట! చెన్నై నగరంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి నీళ్ళు విడుదల చేయమని కోరేందుకు ఆయన ఈరోజు విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన నిజంగా నీళ్ళ కోసమే వచ్చారా లేకపోతే తన కుర్చీ క్రిందకు నీళ్ళు వస్తునందున దానిని చంద్రబాబు నాయుడు సహాయంతో కాపాడుకోనేందుకే వచ్చారా? అనే అనుమానం ఉంది.

తెలుగు గంగ నుంచి నీటి విడుదల గురించి తమిళనాడు ప్రభుత్వం ఏపి సర్కార్ కి లేఖ వ్రాయడం, తగినంత నీటి నిలువలు లేనందునే నీళ్ళు విడుదల చేయలేకపోతున్నామని జవాబు వ్రాయడం వంటి శాస్త్ర ప్రకారం జరుగవలసిన తంతు అంతా పూర్తయిన తరువాతే పన్నీర్ సెల్వం విజయవాడలో వాలడం వలన ఆయన అందుకే వచ్చి ఉంటారని పైకి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అది చంద్రబాబు నాయుడుని కలవడానికి ఒక సాకు మాత్రమేనని భావించవచ్చు.

రెండు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్ళి అక్కడ ఇండియా టుడే నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొని తను ఒకప్పుడు డిల్లీలో చక్రం తిప్పానని, ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ వదులుకొన్నానని, నేటికే అదే ఫేసు అదే గ్రేసు తనలో ఉందని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఆ మాటలు విన్నాక పన్నీరుకి తన కుర్చీ కాపాడుకోవడానికి చంద్రబాబు ఏమైనా చక్రం తిప్పి సహాయపడతారేమోననే ఆలోచన కలిగి ఉండవచ్చు.

నిజానికి పన్నీరు తన మెతక వైఖరి విడిచిపెట్టి, జయలలిత మేనకోడలు రూపా లేదా ప్రతిపక్ష డిఎంకె పార్టీ నేత స్టాలిన్ చేతినో లేదా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ చేతినో పట్టుకొంటే శశికళ ఆయన కుర్చీ వైపు కన్నెత్తి చూసే సాహసం చేసేవారుకారు. కానీ పన్నీర్ సెల్వంకి అంత ధైర్యసాహసాలు లేవని రుజువయింది కనుక ఇక చంద్రబాబు నాయుడే చక్రం తిప్పి ఆయన కుర్చీని కాపాడాలేమో? ఆ..పన్నీర్ సెల్వం మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళేటప్పుడు చెంబుడు తెలుగు గంగ నీళ్ళు ఆయన చేతికిచ్చి పంపిస్తే ఎవరికీ ఇటువంటి అనుమానాలు రావు. 


Related Post