అమిత్ షా తెలంగాణా పర్యటన...దేనికి?

January 12, 2017


img

మార్చి11వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆ తరువాత భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి భాజపాను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మలచాలని అమిత్ షా ఆలోచిస్తున్నారుట. బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్ ని ఏర్పాటు చేసుకొని, కేంద్రప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలని భావిస్తున్నారుట. కనుక అమిత్ షా కంటే ముందుగా తెలంగాణా రాష్ట్ర భాజపా ఇన్-చార్జ్ సావధాన్ సింగ్ రాష్ట్రంలో పర్యటించి రాష్ట్ర భాజపా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారని సమాచారం.

రాష్ట్రంలో బలపడి అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కాదు. కానీ ఈ విషయంలో అది కూడా వైకాపాలాగే వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వైకాపా పరోక్షంగా తెరాసకు మద్దతు ఇస్తూనే తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. వైకాపాకు రాష్ట్రంలో బలం, ప్రజాధారణ లేదు కనుక అది ఎన్నటికీ అధికారంలోకి రాలేదు. ఆ సంగతి దానికీ తెలుసు. కనుక అది ఆవిధంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. 

కానీ భాజపా జాతీయ పార్టీ. కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. తెలంగాణాలో కూడా దానికి ఎంతో కొంత బలం, ప్రజలలో మంచి గుర్తింపు కూడా ఉంది. అయినా అది తెరాసతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్లు వ్యవహరిస్తుంటుంది. రాష్ట్ర నేతలు తెరాసను విమర్శిస్తుంటే, కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు తెరాస సర్కార్ ను పొగుడుతూ ఉండేవారు. తెరాస సర్కార్ కూడా వారితో అలాగే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. బహుశః అది చూసేనేమో రాష్ట్ర భాజపా నేతలు కూడా ఇప్పుడిప్పుడే తెరాస పట్ల కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ రెండు పార్టీల మద్య ఏర్పడిన ఈ సానుకూల వాతావరణం చూస్తున్నప్పుడు అవి వచ్చే ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవచ్చనే అభిప్రాయం కలుగుతుంది. 

ఈనేపధ్యంలో రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసుకోవడం, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకోవడం భాజపా అయోమయాన్ని పొడిగించినట్లవుతుంది. ఒకవేళ అది తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే, ముందు ఆ దిశలో ప్రయత్నాలు చేసి రాష్ట్ర భాజపాలో నెలకొన్న అయోమయం తొలగించుకోవచ్చు. లేదా తెరాసను తమ రాజకీయ శత్రువుగా భావిస్తున్నట్లయితే అందుకు అనుగుణంగా భాజపా వ్యవహరించాలి. తెరాసతో ఏవిధంగా వ్యవహరించాలో నిర్ణయించుకోకుండా భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.


Related Post