అచ్చేదిన్ రావాలంటే అదే మార్గం అట!

January 11, 2017


img

దేశప్రజలు కాంగ్రెస్ పార్టీ అవినీతి, అసమర్ధ పాలన భరించలేకనే 2014 ఎన్నికలలో గద్దె దింపేసి కేంద్రంలో ఎన్డీయే కూటమికి, వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీలకు అధికారం కట్టబెట్టారని అందరికీ తెలుసు. రెండున్నరేళ్ళ తరువాత కూడా నేటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. పైగా నానాటికీ దాని పరిస్థితి వేగంగా క్షీణిస్తునే ఉంది. ఉదాహరణకి ఏపి, యూపి, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ వంటి కొన్ని రాష్ట్రాలలో అది మళ్ళీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటమే లేదు. కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు వంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా అధికారంలోకి రాలేకపోతోంది. 403 సీట్లున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి కనీసం 10  సీట్లు కూడా గెలుచుకొనే అవకాశాలు లేవని సర్వేలు ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ శల్యసారధ్యం చేస్తున్నంత కాలం కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదనే చెప్పవచ్చు. 

తమ పార్టీ దుస్థితికి కారణాలు కనుగొని వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా, ప్రధాని మోడీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ కాలక్షేపం చేస్తుండటమే ఒక పెద్ద పొరపాటని చెప్పవచ్చు. అసలు తమ పార్టీ దుస్థితి గురించి తెలుసుకోకుండా మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే దేశానికి ‘అచ్చేదిన్’ వస్తాయని రాహుల్ గాంధీ చెప్పడం చాల హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఇక ముందు కూడా ఇదేవిధంగా సాగినట్లయితే, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవచ్చు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, దేశ రాజకీయ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానని ప్రగల్భాలు పలికిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అదే పని చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. మోడీ తన నిర్ణయాలతో దేశాన్ని తిరోగమనపధంలో నడిపిస్తున్నారని రాహుల్ విమర్శిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. తన పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా మోడీని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తే మోడీకి ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీ దానిని నమ్ముకొన్నవారే మునిగిపోతారని రాహుల్ గాంధీ గ్రహిస్తే మంచిది. 


Related Post