పాపం మన సైనికులు..

January 11, 2017


img

కుక్కను చంపాలనుకొంటే ముందు అది పిచ్చిదనే ముద్రవేయాలి. ఆ తరువాత దానిని చంపినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. బి.ఎస్.ఎఫ్.కూడా తన జవాను తేజ్ బహద్దూర్ యాదవ్ పట్ల ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తోంది. ఇంతకీ అతను చేసిన మహాపాపం ఏమిటంటే సరిహద్దుల వద్ద ప్రాణాలకు తెగించి పని చేస్తున్న తమకు సరైన ఆహారం ఈయడం లేదని సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఒక వీడియోని పోస్ట్ చేయడమే. 

ఎముకలు కోరికే చలిలో శత్రువుల తుపాకీ గుళ్ళ మద్య తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న తమకు కడుపునిండా ఆహరం కూడా పెట్టలేరా? అని ప్రశ్నించాడు. ప్రభుత్వం అన్నీ సమకూరుస్తున్నప్పటికీ అవన్నీ ఎక్కడకు వెళ్ళిపోతున్నాయని, తమకు ఆహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. అదే అతను చేసిన ఘోరమైన నేరం. 

అంతే అతనిపై అధికారులు ప్రతీకార చర్యలు మొదలుపెట్టేశారు. అతను పక్కా తాగుబోతు, విధులు సరిగ్గా నిర్వహించడు...క్రమశిక్షణ బొత్తిగా లేనివాడు..కొన్ని రోజులు జైలులో కూడా ఉన్నాడు..అంటూ చేంతాడంత నేరాల చిట్టాను వినిపించారు. ఆ త్రాగుబోతు మాటలను ఎవరూ పట్టించుకోనవసరం లేదని తేల్చి పడేశారు. మిగిలిన జవాన్లు అందరూ నోరు మూసుకొని సారీ...నోరు తెరుచుకొని అదే ఆహారాన్ని ఆనందంగా తింటుంటే ఇతనికొక్కడికే తెగులా? అని ప్రశ్నిస్తున్నారు. 

సైనికులు అంటే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది వారి క్రమశిక్షణ, ఆ తరువాత వారి త్యాగాలు, ధైర్యసాహసాలు. మరి ఇన్నేళ్ళుగా తేజ్ బహద్దూర్ యాదవ్ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తుంటే, పక్కా తాగుబోతని తెలిసి ఉన్నప్పుడు అతనిని ఉద్యోగంలో ఎందుకు కొనసాగించినట్లు? ఇంతకాలం అతని గురించి బయటకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే అతని గురించి అంతా చెడ్డగా ఎందుకు చెపుతున్నారు? అతను వీడియోలో చూపిన మాడిపోయిన రొట్టెల గురించి అధికారుల సంజాయిషీ ఏమిటి? అనే సందేహాలు కలుగుతాయి. తేజ్ బహద్దూర్ యాదవ్ బయటపెట్టిన ఈ భయంకరమైన చేదు నిజాలను అవినీతి అధికారులు జీర్ణించుకోలేరు. వారి అవినీతి గురించి యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. అందుకే అతనిపై ఈ ఆరోపణలు చేస్తున్నట్లు భావించకతప్పదు. 

అయితే ఈ విషయం గురించి త్వరలోనే అందరూ మరిచిపోవడం ఖాయం. కానీ అతను బయటపెట్టిన ఈ సమస్య మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోవచ్చు. అర్ధాకలితో మాడుతున్న మన సైనికులకి సరైన ఆహారం అందించకుండా వారి ధైర్యసాహసాలను పొగుడుతూ శత్రు సైనికులతో పోరాడమని అడగడం మనకి న్యాయమేనా? మన సైనికులు సర్జికల్ స్ట్రయిక్స్ చేసి వస్తే ఆ క్రెడిట్ కోసం అందరూ పోటీలు పడుతుంటారు. దానిని ఎన్నికలలో ఓట్లుగా మలుచుకొనే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఆ సైనికులు నోరు తెరిచి అన్నం పెట్టమని అడిగితే వారు దుష్టులు, దుర్మార్గులు, క్రమశిక్షణలేని వారు త్రాగుబోతులు అయిపోతారు. 

తేజ్ బహద్దూర్ యాదవ్ ధైర్యం చేసి బయటపెట్టిన ఈ సమస్యని చూసి “అయ్యో మన సైనికులకు ఇంత కష్టం వచ్చిందా?” అని ఆవేదన చెందకుండా ఉండలేము. సమస్యని బయటపెట్టిన అతనిపై కక్షపూరిత చర్యలకు పాల్పడే బదులు, ఆ సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు అతనిని గౌరవించి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మన జవాన్లు సంతోషిస్తారు..దేశ ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. 


Related Post