బాబుగారు..ఎందుకీ గొప్పలు?

January 11, 2017


img

రాజకీయ పార్టీలు తమ పార్టీ, తమ ప్రభుత్వ పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం, ప్రతిపక్షాలను విమర్శించడం సహజమే కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే స్వంత డబ్బా వాయించుకొంటూ నవ్వులపాలవుతుంటారు.  అటువంటి వారిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకరని చెప్పక తప్పదు. ఆయన నిసందేహంగా మంచి సమర్ధుడైన ముఖ్యమంత్రే. అపారమైన రాజకీయ, పరిపాలనానుభవం ఉన్నవారే. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తే. హైదరాబాద్ ని హైటెక్ సిటీని నిర్మించింది ఆయనే. నగరానికి ఐటిని తెచ్చిపెట్టింది కూడా ఆయనే. కానీ ఆయన గొప్పదనాన్ని ప్రజల నోట విన్నప్పుడో లేదా మీడియాలో చూస్తే ఇంకా గొప్పగా  ఉంటుంది. కానీ ఆయనే స్వయంగా పదేపదే తన గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేస్తుండటం వలన నవ్వులపాలవుతున్నారు. పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు ఆ విషయం గురించి తెదేపా నేతలు, మంత్రులు ఎవరూ ఆయనకి చెప్పే ప్రయత్నం చేయకపోవడం వలన ఆయన స్వంతా డబ్బా నిరంతరంగా మ్రోగుతూనే ఉంటోంది. 

ఇండియా టుడే అధ్వర్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ డబ్బాను బయటకు తీసి వాయించారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తాను తలుచుకొంటే దేవగౌడ, ఐకే గుజ్రాల్ కంటే ముందుగానే దేశానికి ప్రధానమంత్రిని అయ్యేవాడినని, కానీ తన పరిమితులు తనకు తెలుసు కనుక ఆ పదవి కోసం ఆశపడకుండా రాష్ట్రానికే పరిమితం అయ్యానని చెప్పారు. తనకు రాష్ట్రాభివృద్ధి చేయడంలోనే చాలా సంతృప్తి పొందుతానని అందుకే రాష్ట్రంపైనే దృష్టి పెట్టి పనిచేసుకుపోతున్నానని అన్నారు. 

చంద్రబాబుకి ప్రధాని పదవి చేప్పట్టగల అవకాశం వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పుకోవడం కూడా అనవసరమే. తన పరిమితులు లేదా బలహీనతల గురించి ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరం ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు. కానీ ఆ విధంగా చెప్పుకోవడం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి తాను అనర్హుడనని స్వయంగా చెప్పుకొన్నట్లయింది. ఇక ఆ పరిమితుల కారణంగానే రాష్ట్రానికి పరిమితం అయ్యానని ఒక పక్క చెప్పుకొంటూనే, మళ్ళీ తను పదవుల కోసం ప్రాకులాడేవాడిని కానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. 

ఆయన ఎంత సమర్ధుడైన నేత, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ స్వోత్కర్ష వలననే నలుగురిలో తనను తానే చులకన చేసుకొంటున్నారని చెప్పక తప్పదు. 1975లో విడుదలైన ముత్యాల ముగ్గు సినిమాలో విలన్ గా నటించిన రావు గోపాలరావు తనని ఎవరైనా పొగిడి బుట్టలో వేసుకొంటారనే భయంతో తన వెనుకే ఒక మద్దెల వాయించే వ్యక్తిని నియమించుకొంటాడు. కానీ ఎవరైనా నిజంగానే పొగుడుతునప్పుడు, వెనుకనున్న వ్యక్తి మద్దెల వాయించడం మొదలుపెడితే, “ఒరేయ్ ఆపరా..నీ మద్దెలగోల...వాళ్ళు నా గురించి నిజం చెపుతున్నా వాయించేస్తావేమిటి?” అని ముద్దుగా విసుక్కొనేవాడు. నాలుగు దశాబ్దాల క్రితం చూసిన ఆ సన్నివేశం నేటికీ అందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. 

చంద్రబాబు కూడా ఆవిధంగా మద్దెల వాయించే వ్యక్తిని ఏర్పాటు చేసుకొంటే బాగుంటుందేమో? కానీ ఎవరో పొగిడినప్పుడు కాకుండా ఆయన తనను తాను పొగుడుకోవడం మొదలుపెట్టినప్పుడే వాయించేలాగ ఏర్పాటు చేసుకొంటే బాగుంటుంది. అప్పుడు అది ఆగకుండా మోగుతూనే ఉంటుందేమో? 


Related Post