ప్రతీ సంక్రాంతికి ఆ పరీక్ష తప్పదు

January 10, 2017


img

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం అగ్ని పరీక్ష పెడుతుంటుంది. తమిళనాట సంక్రాంతి పండుగ సందర్భంగా ఎడ్లను వెంటపడి పట్టుకొనే ఒక సంప్రదాయ క్రీడ నిర్వహింస్తుంటారు. దానినే వారు జల్లికట్టు అంటారు. నోరు లేని మూగ జీవాలను ఆ విధంగా హింసించడం నేరం అంటూ జంతుప్రేమికులు గతంలో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు వారి వాదనలతో ఏకీభవిస్తూ జల్లికట్టును నిషేదించింది.

మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఆ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయాలు చేయడం మొదలుపెడతాయి. ప్రతిపక్షాలకు తాము దొరికిపోకూడదనే ఉద్దేశ్యంతో ఈ క్రీడను అనుమతిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయవలసిందిగా అభ్యర్ధిస్తూ ముఖ్యమంత్రి కేంద్రానికి ఒక లేఖ వ్రాసి చేతులు దులుపుకొంటారు. మళ్ళీ ఈసారి కూడా అదే జరిగింది.

ఎప్పటికైనా తమిళనాడులో అడుగుపెట్టి ఆ రాష్ట్రంలో కూడా తమ జెండా ఎగురవేయాలని భాజపా తహతహలాడుతున్నందున, ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కూడా చాలా లౌక్యంగా వ్యవహరించి తప్పించుకొంటూ ఉంటుంది. ఈసారి కూడా అదే చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తన నిర్ణయం ప్రకటించిన తరువాత దానిని బట్టి తాము నిర్ణయం తీసుకొంటామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ చెప్పారు.

జల్లికట్టు క్రీడను సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకిస్తోంది కనుక దానిపై ఎటూ తేల్చకుండా రోజులు దొర్లించేయవచ్చు. కనుక కేంద్రమూ నిర్ణయం తీసుకోదు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరూ నిందించలేరు. సుప్రీంకోర్టు అవునన్నా కాదన్నా సంక్రాంతి పండుగకి తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రాలో కోడి పందేలు జరుగుతూనే ఉంటాయి. దానిపై ప్రతీ ఏటా అధికార, ప్రతిపక్షాల మద్య రాజకీయాలు సాగుతూనే ఉంటాయి. అలాగే అనేక సంక్రాంతులు వచ్చిపోతుంటాయి. ప్రతీ ఏటా ఈ తంతు షరా మామూలే!


Related Post