ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నా: చిరంజీవి

January 10, 2017


img

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్:150 చిత్రం బుదవారం విడుదల కాబోతున్న తరుణంలో ఆయన మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నాది, పవన్ కళ్యాణ్ ది ఆశయం ఒక్కటే అయినా మా దారులు వేరు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలాగ ఉండబోతున్నాయో, అప్పుడు నేను ఏవిధంగా వ్యవహరించాలనే విషయాలపై ఇప్పుడు ఆలోచించడం లేదు. (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర రాజకీయాలలో స్తబ్దత ఏర్పడినందున సినిమాలపై దృష్టి పెట్టాను,” అని అన్నారు.

చిరంజీవి చెపుతున్న స్తబ్దత ఏపిలో ఏర్పడలేదు కాంగ్రెస్ పార్టీలోనే ఏర్పడింది. ఏపిలో కాంగ్రెస్ క్రమంగా తుడిచిపెట్టుకుపోవడంతో అక్కడ అది తన ఉనికిని కోల్పోయింది. బహుశః దానినే చిరంజీవి స్తబ్దత అంటున్నట్లున్నారు. ఆ కారణంగా సినిమాలపై దృష్టి పెట్టానని చెప్పడం సరికాదు. తనను అందలం ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందని తెలిసి ఉన్నప్పుడు, ఆయన తన పూర్తి సమయం పార్టీకి కేటాయించి రాష్ట్రంలో మళ్ళీ దానిని బ్రతికించుకొనే ప్రయత్నం చేసి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ కష్టకాలంలో పార్టీలో స్తబ్దత నెలకొందనే కారణంతో సినిమాలు చేసుకొంటున్నానని చెప్పడం సబబు కాదు. సినిమలు చేసుకోవడం అంటే పార్టీ భవిష్యత్ కంటే తన భవిష్యత్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, వ్యక్తిత్వం, రాజకీయ విధానాలు అన్నీ భిన్నంగానే ఉంటాయి కనుక వారిద్దరూ కలిసి పనిచేయడం కూడా అసంభవమేనని చెప్పవచ్చు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందేమో కానీ ఏపిలో మాత్రం లేనట్లే కనిపిస్తోంది. కనుక ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ లోనే కొనసాగదలిస్తే ఇక ఏపి రాజకీయాలలో ఆయన చేయవలసింది ఏమీ ఉండకపోవచ్చు. సినిమాలలో "బాస్ ఈజ్ బ్యాక్" అని గొప్పగా చెప్పుకొని రీఎంట్రీ ఇవ్వడం సాధ్యమయ్యిందేమో కానీ ఏపి రాజకీయాలలో అది సాధ్యం కాకపోవచ్చు. 


Related Post