ఆల్ ఈజ్ నాట్ వెల్ మిష్టర్ జైట్లీ!

January 10, 2017


img

నోట్ల రద్దు నిర్ణయంపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పిన కారణాలు ఏమిటి? తెర వెనుక కారణాలు ఏమిటి? దాని వలన ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా?వంటి విషయాలపై వాదోపవాదాలను పక్కనపెట్టి చూసినట్లయితే, కొన్ని కొత్త విషయాలు కనిపిస్తాయి. 

చాలా దేశాలు, చాలా మంది మేధావులు, గొప్ప ఆర్ధిక నిపుణులు ఊహించినట్లుగా ఈ నిర్ణయం కారణంగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోలేదు పైగా ఇంకా దృడపడింది. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చిన తరువాత ఎదురైనా అతి పెద్ద సవాళ్ళలో ఒకటైన దీనిని కూడా అందరూ కలిసి విజయవంతంగా అధిగమించి భారత  ఆర్ధిక వ్యవస్థ సత్తాను లోకానికి చాటి చూపి విమర్శకుల నోళ్ళు మూయించారు. 

ఈ నిర్ణయం కారణంగా దేశ ప్రజలు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదు. యావత్ దేశ ప్రజలు కేంద్రప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కేంద్రప్రభుత్వంతో సహా ప్రతిపక్షాలు, విమర్శకులు, భారత్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ విషయాన్ని కూడా తప్పక గుర్తించాలి. దేశాన్ని సమూలంగా ప్రక్షాళనం చేసుకోవాలన్న తపనే వారిని ఆ కష్టాలు ఓర్చుకొనేలా చేసిందని చెప్పవచ్చు. 

ఈ నిర్ణయం కారణంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులు చాలా బారీగా పెరిగాయని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గణాంకాలతో సహా వివరించారు. ఇన్ని రోజులు దేశాప్రజలందరూ ఇన్ని కష్టాలు భరించినందుకు సత్ఫలితాలు రావడం అందరికీ సంతోషమే. కానీ నోట్ల రద్దు కారణంగా చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటం అన్నీ కట్టుకధలేనని జైట్లీ చెప్పడం చాలా దారుణం. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పెరిగినంత మాత్రాన్న డిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని దేశంలో అంతా బాగానే ఉందని సర్టిఫై చేయడం అవివేకమే అవుతుంది. ఈ రెండున్నర నెలలలో ప్రజలు పడిన కష్టాలను, త్యాగాలను జైట్లీ గుర్తించలేదని భావించవలసి ఉంటుంది. తమ ప్రభుత్వ నిర్ణయం తప్పు కాదని, అందుకు నిదర్శనంగా ప్రభుత్వ ఆదాయం చాలా బారీగా పెరిగిందని చూపేందుకు జైట్లీ ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ అది తమ ఘనత అని చెప్పుకొనే బదులు దేశ ప్రజలందరూ సహకరించబట్టే సాధ్యం అయిందని, కనుక ఈ ఫలాలను తిరిగి వారికే దక్కేలా తప్పకుండా ప్రయత్నాలు చేస్తామని జైట్లీ గట్టిగా చెప్పి ఉండి ఉంటే ప్రజలందరూ కూడా సంతోషించి ఉండేవారు కదా. మాటలలో కృతజ్ఞత చెప్పకపోయినా పరువాలేదు..కనీసం బడ్జెట్ లో అయినా సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఉపకారం చేస్తే అంతే చాలు.


Related Post