భాజపాకి ప్రత్యామ్నాయం లేదా?

January 09, 2017


img

ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ప్రసంగించిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒక ఆలోచనాకరమైన విషయం చెప్పారు. దేశంలో హిందువులు సెక్యులర్ గానే ఉంటారు. కానీ బాగా మాటకారి అయిన ఒక వ్యక్తి వారిని తన మాటలతో ప్రభావితం చేసి తనవైపు తిప్పుకొన్నాడు. కాంగ్రెస్ బలహీనపడటం వలననే భాజపా అధికారంలోకి రాగలిగింది,” అని అన్నారు. 

ఆయన చెప్పిన ఆ మాటకారి ప్రధాని నరేంద్ర మోడీ అని వేరే చెప్పనవసరం లేదు. మోడీ గురించి వ్యక్తిగతంగా ఓవైసీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా మోడీ మాటకారితనం, కాంగ్రెస్ బలహీనత గురించి ఆయన అభిప్రాయలు నిజమేనని చెప్పక తప్పదు. 

ఒకప్పుడు గుజరాత్ అల్లర్ల కారణంగా దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న మోడీ, ఇప్పుడు అదే ప్రజల చేత జేజేలు పలికించుకొంటున్నారంటే ఆయన పని తీరు ఒక్కటే కారణం కాదు. ఆయన మాటకారితనం కూడా ఒక కారణమే. దేశాభివృద్ధి గురించి ఆయన చెపుతున్న మాటలు ప్రజలకు నమ్మకం కలిగించడమే కాకుండా ఆయన చేతలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉండటంతో ప్రజలకు కూడా ఆయనపై గురి కుదిరింది.

ఆయనని 2014 ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా భాజపా ఎంచుకొన్నప్పుడు పార్టీలో అద్వానీ వంటి సీనియర్ నేతలే తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ భాజపా తన నిర్ణయంపై దృడంగా నిలబడటంతో మోడీ రంగంలో దిగి అన్ని అవరోధాలను ఒకటొకటిగా అధిగమిస్తూ పార్టీని విజయపధంలో నడిపించి, ప్రధాని పదవి చేపట్టేందుకు తను అన్ని విధాల అర్హుడనని నిరూపించుకొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం కొరవడటం పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను చూసి ప్రజలు విసిగిపోయుండటం కూడా భాజపాకి చాలా సానుకూలతగా మారింది. 

ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. కానీ నేటికీ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం అలాగే ఉంది. రాహుల్ గాంధీకి పార్టీని నడిపించగల నాయకత్వ లక్షాణాలు లేవని ఆ పార్టీలో సీనియర్ నేతలే స్వయంగా చెప్పుకొంటుంటారు. ఆయన మోడీకి ఏనాటికీ సరిసమానం కాలేరని చెప్పవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీని కాపాడి, మోడీని డ్డీ కొనగల మొనగాడిని ఆ పార్టీ కనుగొనే వరకు ఇక భాజపాకు తిరుగు ఉండదు. మోడీ పనితీరు, మాటకారితనం మాత్రమే కాదు కాంగ్రెస్ యొక్క బలహీనత కూడా భాజపాకు శ్రీరామరక్షే అని చెప్పక తప్పదు. 


Related Post