మద్రాస్ హైకోర్టుపై సుప్రీం తీర్పు ఎఫెక్ట్?

January 09, 2017


img

జయలలిత మృతిపై దాఖలైన పిటిషన్ తమిళనాడు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం డిశంబర్ 29న విచారణ జరిపినప్పుడు జస్టిస్ వైద్యనాధన్ మాట్లాడుతూ జయలలిత మృతిపై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని, ఆమె శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. అదే తను ఒక్కడే ఈ కేసును విచారించినట్లయితే, అది వేరే విధంగా సాగేదని అన్నారు. కానీ అదే ధర్మానసం ఇప్పుడు ఆ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు విన్న తరువాత తన వైఖరిని మార్చుకొన్నట్లు అనిపిస్తుంది. 

అన్నాడిఎంకె బహిష్కృత ఎంపి శశికళ పుష్ప వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, అది విచారణకు అర్హమైనది కాదని కొట్టివేయడమే కాకుండా మళ్ళీ ఎవరైనా ఈ కేసులో పిటిషన్లు వేసినట్లయితే జరిమానా విధిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. 

ఈ నేపధ్యంలో మద్రాస్ హైకోర్టు సోమవారం ఆ కేసుని మళ్ళీ విచారణకు చేపట్టినప్పుడు, జయలలిత రక్తసంబంధీకులు కాని వారు ఈ పిటిషన్ వేయడానికి ఏమి అర్హత ఉందని ప్రశ్నించింది. అపోలో ఆసుపత్రి తరపున విచారణకు హాజరైన న్యాయవాది పిఎస్ రామస్వామి, జయలలితకు ఆసుపత్రిలో ఉండగా అందించిన చికిత్సకు సంబంధించిన అని వివరాలను సీల్డు కవరులో కోర్టుకు అందజేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు ఈ కేసును ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. అంటే ఇంచుమించు రెండు నెలలు అన్నమాట! కనుక ఈ కేసులో హైకోర్టు వైఖరి మారినట్లు అది సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. బహుశః దానిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పడిందనుకోవాలేమో?


Related Post