చంద్రబాబుకి పక్కలో బల్లెం?

January 08, 2017


img

రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో రకరకాల హామీలు ఇస్తుంటాయి. చంద్రబాబు కూడా అలాగే ఇచ్చారు. వాటిలో కాపులకు రిజర్వేషన్లు కల్పించడం ఒకటి. అదే ఆయన మెడకు పాములాగ చుట్టుకొంది. దీనితో అయనను రాజకీయంగా దెబ్బ తీయవచ్చని జగన్మోహన్ రెడ్డి గ్రహించారు. కానీ ఈ వ్యవహరంలో నేరుగా జోక్యం చేసుకొంటే  ఇతర కులాలు ముఖ్యంగా బీసిలు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉందని గ్రహించి, ముద్రగడ పద్మనాభాన్ని ముందుకు తీసుకువచ్చి ఆయన భుజంపై తుపాకి పెట్టి చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.

ఊహించినట్లుగానే ఆయన చంద్రబాబుకి పక్కలో బల్లెంలాగ తయారయ్యారు. కాపులకి రిజర్వేషన్లు ఇంకా ఎప్పుడు ఇస్తారని నిలదీస్తున్నారు. మద్యమద్యలో పాదయాత్రలు, కంచాలు, కొవ్వొత్తులు అంటూ ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం కొనసాగిస్తున్న తీరు చూస్తుంటే, కాపులకు రిజర్వేషన్లు సాధించాలని కాక ఈ వేడిని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించడానికే అన్నట్లుంది. నెలకీ, రెండు నెలలకీ ఒకసారి మీడియా ముందుకువచ్చి హడావుడి చేస్తుంటారు.

మళ్ళీ నిన్న కూడా మీడియా సమక్షంలో చంద్రబాబుకి ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో బాబుకి ఆయన హితోపదేశం చేస్తూ “సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పోటీ పడితే ఎవరో ఒకరే గెలుస్తారు. కానీ మమ్మల్ని (కాపులనా లేక ముద్రగడనా?) ఓడించాలని ప్రయత్నిస్తే మీరే ఓడిపోతారు. ఇటువంటి థియరీ ఇంతవరకు ఏ పుస్తకాలలోనూ మీరు చదివి ఉండరు. కనుక ఆవేశంతో గొప్పలు చెప్పుకోకండి,’’అని వ్రాశారు.

ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే, వాటి వలన బీసిలకు నష్టం కలుగుతుంది కనుక వారు ఆయనపై ఆగ్రహించే ప్రమాదం ఉంది. ఇవ్వకపోతే కాపులను మోసం చేశారని వాదిస్తూ కాపు ఓటు బ్యాంక్ ను వైకాపావైపు మళ్ళించాలని ముద్రగడ ప్రయత్నిస్తున్నట్లున్నారు. అందుకే ఈ అంశంపై వేడి చల్లారిపోకుండా ముద్రగడ కాపాడుకొస్తున్నాట్లున్నారు. కానీ చంద్రబాబు కాపులని మోసం చేశారని వాదిస్తున్న ముద్రగడ, ఈ విషయంలో జగన్ చేత హామీ ఇప్పించగలరా? ఎందుకంటే మరో రెండున్నళ్ళ తరువాత తనే ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జగన్ పదేపదే చెప్పుకొంటున్నారు కదా? అది సాధ్యం కాదు కనుక చివరికి చంద్రబాబు, జగన్ మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్య పోరులో ముద్రగడే దెబ్బ అయిపోయే ప్రమాదం ఉంది. ఓటుకి నోటు కేసు, ప్రత్యేక హోదా వంటి ఇంతకంటే పెద్ద సమస్యల నుంచే చంద్రబాబు చాలా తెలివిగా బయటపడగలిగారు. ముద్రగడను, జగన్మోహన్ రెడ్డిని వారి ఈ వ్యూహాన్ని తిప్పికొట్టలేరనుకొంటే అవివేకమే అవుతుంది. 


Related Post