నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాలేదు కానీ..

January 09, 2017


img

దేశంలో నిరుపేద ప్రజలకి కూడా బ్యాంక్ అకౌంట్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ రెండేళ్ళ క్రితం జన్ ధన్ అకౌంట్ల పధకాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్ళలో సుమారు 20 కోట్లు జన్ ధన్ ఖాతాలు తెరిపించగలిగారు కానీ వాటిలో జమా చేసేందుకు వారి వద్ద డబ్బు లేకపోవడంతో వాటిలో చాలా వరకు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. కానీ నవంబర్ 8న మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజు నుంచి నల్లకుభేరులు వాటిలో తమ నల్లధనాన్ని వేసుకొని కొత్తనోట్లుగా మార్చేసుకోవడం మొదలుపెట్టేరు. దానితో వాటన్నిటికీ మంచి డిమాండ్ ఏర్పడింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే దేశంలో కొత్తగా సుమారు 2 కోట్లు జన్ ధన్ ఖాతాలు తెరువబడ్డాయి. అవికాక కొత్తగా సాధారణ సేవింగ్ ఖాతాలు 1.1 కోట్లు తెరువబడ్డాయని కేంద్ర ఆర్ధిక నిఘా సంస్థ (ఫైనాన్షియల్ ఇంటలిజన్స్ యూనిట్) ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు తెలియజేసింది. 

రెండేళ్ళుగా పేద ప్రజల చేత జన్ ధన్ ఖాతాలు తెరిపించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు కానీ నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా 2 కోట్లు ఖాతాలు తెరువబడ్డాయి. సాధారణ, జన్ ధన్ ఖాతాలలో కలిపి నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 3 లక్షల కోట్లు జమా అయినట్లు కేంద్ర ఆర్ధిక నిఘా సంస్థ అధికారి చెప్పారు. కానీ ఆవిధంగా పేదల ఖాతాలలో జమా అయిన డబ్బు అంతా మళ్ళీ రూపం మార్చుకొని రూ.2,000 నోట్లుగా నల్లకుభేరుల వద్దకు చేరుకొంది. అదీగాక కొందరు అవినీతిపరులైన బ్యాంక్ అధికారులు, సిబ్బంది వలన కొన్ని వేల కోట్లు విలువగల కొత్త నోట్లు నేరుగా నల్లకుభేరులు ఇళ్ళకు చేరిపోవడం అందరూ చూశారు. అంటే నోట్ల రద్దు వలన నల్లదనం తన రూపం మార్చుకొంది తప్ప అది వ్యవస్థ నుంచి తొలగించబడలేదని స్పష్టం అవుతోంది. 

నోట్ల రద్దు వలన మార్కెట్లో ఉన్న నకిలీ కరెన్సీకి చాలా వరకు చెక్ పెట్టినట్లు చెప్పవచ్చు. నల్లధనాన్ని వెలికితీయడంలో తమ ప్రభుత్వం విఫలం అయ్యిందనే విషయం గ్రహించినందునే బహుశః మోడీ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల పల్లవి ఎత్తుకొందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. నగదు రహిత లావాదేవీలు పెరిగితే అది తప్పకుండా దేశంలో నల్లధనం, నకిలీ కరెన్సీ  అరికట్టడానికి కొంత దోహదపడవచ్చు. కానీ సుమారు 50 శాతం మందికి పైగా నిరుపేదలున్న భారత్ లో అది కూడా సాధ్యం కాకపోవచ్చు. 

చివరికి తేలింది ఏమింటంటే కేవలం రూ.3-4,000 కోట్లు నల్లధనం మాత్రమే బయటకు వచ్చింది. మిగిలినదంతా మళ్ళీ సేఫ్ గా నల్లకుభేరుల తిజోరీలలోకి చేరుకొంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే ఈ నెల రోజుల్లో కొత్తగా మరో 2 కోట్లు జన్ ధన్ ఖాతాలు తెరువబడ్డాయి. అంతే. అంటే కేంద్రప్రభుత్వం కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లయింది.


Related Post