జమ్మూలో ఉగ్రదాడులు..రొటీన్ అయిపోయాయా?

January 09, 2017


img

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మిలటరీ వాహనాలపై, ఆర్మీ క్యాంపులపై ఉగ్రవాదుల దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. గత రెండు మూడు నెలల నుంచి నిత్యం ఎక్కడో అక్కడ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం జమ్మూలోని అక్నూర్ సెక్టార్ లోగల ఆర్మీ జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో అక్కడ నిర్మాణపనులు చేస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. పోలీసు దుస్తులలో వచ్చిన ఉగ్రవాదులు  విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేయగా వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుదాడి చేసి వారు లోపలకి ప్రవేశించకుండా అడ్డుకొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకొన్న భద్రతాదళాలు ఆర్మీ క్యాంప్ ను చుట్టుముట్టి ఉగ్రవాదులను ఏరివేతకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. 

ఇదివరకు కాశ్మీర్ లో మూడు నెలలుకు పైగా అల్లర్లు కొనసాగాయి. వాటి జోరు చూస్తున్నప్పుడు అవి ఎప్పటికైనా ఆగుతాయా లేదా అనే అనుమానం కలిగేది. ఆ అల్లర్లను కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటమని, దానికి మద్దతు ఇస్తున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించడం, ఆ అల్లర్ల వెనుక పాక్ ప్రభుత్వం హస్తం ఉందని చాటి చెప్పినట్లయింది. వాటిని అతికష్టం మీద కేంద్రప్రభుత్వం నియంత్రించగలిగింది. కానీ అప్పటి నుంచి ఆర్మీ వాహనాలు, క్యాంప్ లపై ఉగ్రవాదుల దాడులు తీవ్రం అవడం గమనిస్తే పాక్ తన యుద్దవ్యూహం మార్చుకొన్నట్లు స్పష్టం అవుతోంది. కానీ భారత్ దానిని ఎదుర్కొనేందుకు తగిన ప్రతివ్యూహమేదీ రూపొందించుకోలేదని ఈ దాడులు నిరూపిస్తున్నాయి. 

నోట్ల రద్దు వలన సరిహద్దులో ఉగ్రవాదం, వేర్పాటువాదం కొంత తగ్గినప్పటికీ అది పూర్తిగా నిలిచిపోలేదని ఈ దాడులు నిరూపిస్తున్నాయి. సరిహద్దుకి సుమారు 60 కిమీ లోపల గల ఆ ప్రాంతానికి ఉగ్రవాదులు ఆయుధాలతో సహా చేరుకొని ఆర్మీ క్యాంప్ పై దాడులు చేయగలుగుతున్నారంటే దానర్ధం వారికి జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదులు అన్ని విధాల సహాయపడుతున్నారని స్పష్టం అవుతోంది. కనుక ముందుగా ఆ రాష్ట్రంలోని వేర్పాటువాదులను ఏరిపడేస్తే తప్ప ఈ సమస్య ఎన్నిటికీ పరిష్కారం కాకపోవచ్చు.  


Related Post