అందుకే బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయమంటున్నాయా?

January 07, 2017


img

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటికి నాలుగు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 1న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2016-17 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానిలో 5 రాష్ట్రాలలోని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కేంద్రప్రభుత్వం వరాలు ప్రకటించే అవకాశం ఉంటుంది కనుక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు విజ్ఞప్తి చేశాయి. దానిపై ఈసి ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపక్షాల భయాలు అర్ధరహితమని కొట్టి పడేశారు. బడ్జెట్ అనేది ఆ 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదని అది యావత్ దేశానికి సంబంధించిన విషయమని, దానిని అడ్డుకోవడం అంటే దేశ అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. ఆ 5 రాష్ట్రాలలో ప్రజలు నోట్ల రద్దు నిర్నయాన్ని సమర్దిస్తుండటం చూసి ఇంతకాలం దానిని గుడ్డిగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని అందుకే అవి ఓటమి భయంతోనే బడ్జెట్ ని వ్యతిరేకిస్తున్నాయని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. అయినా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తాము ముందే ప్రకటించామని, ఆ తరువాతే ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని కనుక ఎన్నికల కోసం బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయమని ప్రతిపక్షాలు కోరినప్పుడే అవి ఓటమి భయంతో ఉన్నాయని చాటుకొన్నట్లయింది. కానీ వాటి భయాలు కూడా సహేతుకమైనవేనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలు భాజపాకు కూడా చాలా కీలకమైనవే కనుక అది బడ్జెట్ లో ఆ 5 రాష్ట్రాలకు ఏవైనా వరాలు ప్రకటించవచ్చు. కానీ వాటిని ప్రతిపక్షాలు వ్యతిరేకించలేవు. ఒకవేళ వ్యతిరేకించినట్లయితే అదే విషయం ఆ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార సభలలో భాజపా గట్టిగా ప్రచారం చేసుకొని ప్రతిపక్షాలను ఇంకా దెబ్బ తీయగలదు. 

పైగా ఇటీవల లక్నోలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభకి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దానర్ధం వారు నోట్ల రద్దు కారణంగా భాజపాను వ్యతిరేకించడం లేదని స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది. ఇక తాజా సర్వేలు కూడా యూపిలో భాజపాయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెపుతున్నాయి. 

యూపి, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితులు భాజపాకు అనుకూలంగానే ఉన్నాయి. ఇక గుజరాత్, గోవా రాష్ట్రాలలో ప్రస్తుతం భాజపాయే అధికారంలో ఉంది. కనుక అక్కడ దానికి అది అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఒక్క పంజాబ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కనుక పంజాబ్ ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు బడ్జెట్ లో వరాలు ప్రకటించవచ్చు. ఏమైనప్పటికీ నోట్ల రద్దు నిర్ణయం కారణంగా భాజపా ఘోరంగా దెబ్బైపోతుందని అనుకొంటే, పరిస్థితులు అన్నీ భాజపాకే అనుకూలంగా మారడం విశేషం. 


Related Post