అదృష్టమంటే అలా ఉండాలి!

January 07, 2017


img

జయలలిత ఆకస్మిక మరణాన్ని తమిళనాడు ప్రజలు, అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలు నేటికీ జీర్ణించుకోలేక బాధపడుతున్నారు. కానీ 30 ఏళ్ళపాటు ఆమెను నీడలా వెన్నంటి తిరిగిన శశికళ, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఊహించని విధంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకొని పదవులు అధికారం సంపాదించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అది చూసి ‘అమ్మ’ అభిమానులు వారిని అసహ్యించుకొంటూ అమ్మ మేనకోడలు దీపని నెత్తిన పెట్టుకొనేందుకు సిద్దపడుతున్నారు. 

ఇంతకాలం దీప అంటే ఎవరో కూడా వారికి తెలియదు. జయలలిత కూడా ఆమెను దగ్గరకు రానీయలేదు కనీసం పట్టించుకోలేదు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడే మొదటిసారిగా దీప గురించి అందరికీ తెలిసింది. తనే జయ వారసురలినని త్వరలోనే రాజకీయాలలోకి వస్తానని ఆమె ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. కానీ శశికళ అంత వేగంగా ఆమె పావులు కదపలేకపోవడంతో శశికళ పార్టీని హస్తగతం చేసేసుకొన్నారు. నేటికీ ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి జంకుతూనే ఉన్నారు. 

ఆమె ఒక మంచి అవకాశం వదులుకొన్నారని అందరూ భావిస్తుంటే ఊహించని విధంగా అదృష్టం మళ్ళీ ఆమె తలుపు తట్టడం మొదలుపెట్టింది. 

శశికళ పార్టీ పగ్గాలు చేజిక్కించుకొన్నాక ముఖ్యమంత్రి పదవిపై కన్నేసారని, నేడోరేపో ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వంని దించేసి ఆ కుర్చీలో సెటిల్ అయిపోబోతున్నారంటూ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. జయ ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్కె నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 

శశికళ ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహమే ఆమె పట్ల రాష్ట్ర ప్రజలలో, ముఖ్యంగా అమ్మ అభిమానులలో  విముఖత ఏర్పడేలా చేస్తోంది. ఆ విముఖతే దీపకు ఇప్పుడు అదృష్టంగా మారినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరి గుర్తింపుకు నోచుకోని దీప తంతే బూరెల గంపలో పడినట్లయింది. ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆమే జయలలిత అసలైన వారసురాలని నమ్ముతున్నామని కనుక వెంటనే ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇంకా ఆమె మీనమేషాలు లెక్కిస్తుండటం ఆశ్చర్యం. తనను కలవడానికి వస్తున్నవారందరికీ మరికొన్ని రోజులు ఓపిక పట్టమని, తను తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చెప్పి పంపించేస్తున్నారు. 

ఆమె ఎందుకు ఇంకా సమయం కావాలని చెపుతున్నారో తెలియదు కానీ తలుపు తడుతున్న అదృష్టాన్ని కాలదన్నుకొంటే మళ్ళీ మరోసారి ఆమెకు ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. జయలలిత మరణం వలన అన్నాడిఎంకె కార్యకర్తలలో ఏర్పడిన సెంటిమెంటు రోజులు గడుస్తున్న కొద్దీ బలహీనపడటం ఖాయం. అప్పుడు దీప మొహం చూసేవారే ఉండకపోవచ్చు. ఒకవేళ అప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినా అప్పటికే శశికళ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు కనుక వచ్చి ఆమె చేతిలో ఎదురుదెబ్బ తింటే ఇంక రాష్ట్రంలో ఆమెను పట్టించుకొనేవారే ఉండరు. కనుక ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడాలన్నట్లు తలుపు తడుతున్న అదృష్టాన్ని దీప గుర్తించగలిగితే తాడోపేడో తేలిపోతుంది కదా.



Related Post