సింధుకిచ్చిన ప్రోత్సహం మనోళ్ళకి ఇవ్వరా?

January 07, 2017


img

శాసనసభలో నిన్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చలు జరుగుతున్నప్పుడు, తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన అంశం లేవనెత్తారు. రాష్ట్రానికి చెందిన నిరుపేద విద్యార్ధులు అన్నపూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రూ.25లక్షలు మాత్రమే ఇచ్చి దాని గురించి చాలా గొప్పలు చెప్పుకొన్నారు. అదే ఆంధ్రాకు చెందిన పివి సింధు ఒలింపిక్స్ లో వెండి పతకం తెచ్చినందుకు ఆమెకు 4 కోట్లు నగదు, సుమారు 10 కోట్లు విలువ చేసే ఒక స్థలం ఇచ్చారు. తెలంగాణాలో దళిత క్రీడాకారులను పట్టించుకోకుండా ఆంధ్రాకు చెందిన సింధూకి కోట్లు ముట్టజెప్పారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారులకు బహుమతులు పంచిపెట్టే విషయంలో నవాబులాగ వ్యవహరిస్తుంటారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అయన తనకు నచ్చిన క్రీడాకారులకు ఎన్ని కోట్లయినా బహుమానంగా ఇచ్చేస్తారని విమర్శలు వినిపిస్తుంటాయి. సానియా మీర్జా, పివి సింధులకిచ్చిన బారీ బహుమతులే అందుకు నిదర్శనం. 

రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణాలో ప్రతిభ, పట్టుదల కనబరుస్తున్న అన్నపూర్ణ, ఆనంద్ వంటి నిరుపేద విద్యార్ధులకి ఆవిధంగా ప్రోత్సహకాలు అందిస్తూ వారికి అవసరమైన శిక్షణ, సౌకర్యాలు, పోషకాహారం వగైరాలు అందించగలిగి ఉండి ఉంటే దాని వలన వారికి చాలా మేలు కలిగి ఉండేది. అలాగే రాష్ట్రానికి అనేకమంది కొత్త క్రీడాకారులు తయారయ్యేవారు. కానీ క్రీడా రంగాన్ని ఒక్క తెరాస సర్కార్ మాత్రమే కాదు..దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గుదిబండగానే భావిస్తున్నాయని చెప్పకతప్పదు. అందుకే దేశానికి గొప్ప క్రీడాకారులు తయారవడం లేదు. ఎవరైనా స్వయంకృషితో పైకి వచ్చి ఈ విధంగా పతకాలు సాధిస్తే మాత్రం వారికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి కోట్లు ముట్టజెప్పేసి, అంతటితో తమ కర్తవ్యం తీరిపోయినట్లు చేతులు దులుపుకొంటాయి. నేటికీ రాష్ట్రంలో, దేశంలో చాలా పాఠాశాలలో, కాలేజీలలో విద్యార్ధులకు కనీస వసతులే లేవు. ఇక క్రీడలను, ప్రతిభ కనబరుస్తున్న విద్యార్ధులను ఏమి ప్రోత్సహిస్తాయి? 

దేశానికి వన్నె తెస్తున్న క్రీడాకారులను ఆంధ్రా, తెలంగాణా లేదా మరో రాష్ట్రానికి చెందినవారిగానో చూడటం సంకుచితమే అవుతుంది. సింధు క్రెడిట్ స్వంతం చేసుకొనేందుకు చంద్రబాబు పడిన ఆరాటం కూడా చాలా సంకుచితంగానే ఉందని చెప్పకతప్పదు. ఆమె లేదా సాక్షి మాలిక్ లేదా మరొక క్రీడాకారుడిని గౌరవించడం తప్పు కాదు కానీ సంకుచిత దృష్టితో చేయడమే తప్పు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం కూడా సబబు కాదు. అలాగే గొప్ప కోసం వారికి అంత బారీ బహుమతులు ఈయవలసిన అవసరం కూడా లేదు. కోటీశ్వరులైన క్రీడాకారులకు కోట్లు రూపాయలు బహుమానాలుగా పంచిపెట్టడం కంటే నిరుపేద విద్యార్ధులను ప్రోత్సహించడం వలన వారికీ, వారి వలన రాష్ట్రానికి కూడా మేలు కలుగుతుంది. 


Related Post