ఆ లక్షణమే కూడదు కోమటిరెడ్డిగారు

January 06, 2017


img

కాంగ్రెస్ పార్టీకి అనేక లక్షణాలు ఉన్నాయి. వాటిలో కుమ్ములాటలు కూడా ఒకటి. కాంగ్రెస్ పార్టీలో ఏ ముగ్గురు నేతలు సఖ్యతగా ఉండలేరనే జోక్ ఒకటి ఉంది. అది నిజమేనని చెప్పక తప్పదు. ఏ నియోజక వర్గంలో చూసినా కాంగ్రెస్ పార్టీలో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలే ఉంటాయి. ఒకవేళ లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదనుకోవచ్చు. 

ఉదాహరణకి నల్గొండ జిల్లానే తీసుకొన్నట్లయితే జానారెడ్డిది ఒక వర్గం. కోమటిరెడ్డి సోదరులది మరో వర్గం. ఇంతకు ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయనది మరో వర్గం. ఉత్తం కుమార్ రెడ్డిది మరో వర్గం. ఇలాగ ఎంత మంది నేతలుంటే అన్ని వర్గాలన్నట్లు ఉంటుంది కాంగ్రెస్ తీరు. వారు ఒకరినొకరు ప్రత్యక్షంగా విమర్శించుకోకపోయిన, ఎవరూ పైకి ఎదగకుండా అందరూ ఒకరి కాళ్ళు మరొకరు పట్టుకొని క్రిందకి లాగే ప్రయత్నం చేస్తుంటారు.

పిసిసి అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకొంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఉత్తం కుమార్ రెడ్డిపై అప్పుడప్పుడు ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తుంటారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే కోమటిరెడ్డి చాలా సులువైన ఉపాయం చెపుతుంటారు. అదే...తనను పిసిసి అధ్యక్షుడుగా చేయడమేనట! 

ఆ సంగతి తెలియకనే కాంగ్రెస్ అధిష్టానం గత ఎన్నికలలో పొన్నాల లక్ష్మయ్యను దించి ఉత్తం కుమార్ రెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఓడిపోయింది. అది ఇప్పుడు అప్రస్తుత విషయం. కనీసం వచ్చే ఎన్నికలలో అయినా కాంగ్రెస్ అధిష్టానం అటువంటి పొరపాటు చేయకుండా తననో లేదా కనీసం తన సోదరుడు రాజగోపాల రెడ్డినో కూర్చోబెట్టినా అడ్జస్ట్ అయిపోతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెపుతున్నారు. అయితే ఉత్తం కుమార్ రెడ్డి కూడా గెడ్డం సెంటిమెంటుతో అధిష్టానాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు గెడ్డం గీసుకోనని భీకర శపథం చేశారు. కానీ అప్పుడప్పుడు దానిని ట్రిమ్మింగ్ చేసుకొంటున్నారు. అది వేరే సంగతి. 

ఇక తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవన్నట్లుగా, వెంకటరెడ్డి ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా దులిపేశారు. ఆయన పార్టీలో ఉండగా ఎలాగూ గట్టిగా విమర్శించలేకపోయారు. ఇప్పుడు తెరాసలోకి వెళ్ళిపోయారు కనుక  తనివి తీరా దుమ్ము దులిపేశారు. 

గుత్తాని తానే రెండు సార్లు ఎంపిగా గెలిపించానని కానీ ఆయన పార్టీకి హ్యాండిచ్చి తెరాసలోకి వెళ్ళిపోయారని అన్నారు. ఒకవేళ ఈసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన మీద ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకోగలనని చెప్పారు. గుత్తా ఎన్నికల సమయం నుంచే డబ్బు సంపాదించుకొంటే తను, తన సోదరుడు ఎన్నికలలో గెలిచినా సంపాదించుకోలేకపోగా ఉన్నది కూడా పోగొట్టుకొంటున్నామని వెంకట రెడ్డి అన్నారు. అదే తమకు, గుత్తాకు ఉన్న తేడాని అన్నారు. 

ఆయన కాంగ్రెస్ వీడి వెళ్ళిపోయినా వెంకటరెడ్డి అయనకు ఇంకా సవాళ్ళు ఎందుకు విసురుతున్నారో తెలియదు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులకు మంచి పట్టు ఉన్నమాట వాస్తవం. కానీ ఈ విధంగా పార్టీలో ఉన్నవారినీ లేనివారినీ కూడా విమర్శిస్తూ శత్రువులను సృష్టించుకోవడం దేనికో అర్ధం కాదు. పిసిసి అధ్యక్షుడు కావాలనుకొంటే అందరినీ కలుపుకొని పోయే లక్షణం ఉండాలి కానీ అందరితో గొడవలు పడే లక్షణం కాదని గ్రహిస్తే మంచిది. 


Related Post