కాంగ్రెస్ విధానాలనే కొనసాగిస్తున్నాం: కేసీఆర్

January 04, 2017


img

ఈరోజు శాసనసభలో విద్యార్ధుల ఫీజు రీయంబర్స్‌మెంట్ పై శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాల వివరంగా సమాధానం చెప్పారు. “ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ విద్యార్ధులకు ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ఇంకా ఎప్పుడు చెల్లిస్తుంది? అసలు చెల్లించే ఉద్దేశ్యం ఉందా లేదా?” అని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెపుతూ, “పాత లెక్కలు తీయడం వలన ఇప్పుడు సభా సమయం వృధా అవుతుందే తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు కనుక వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడదలచుకోలేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం చెల్లించవలసిన రూ.1,880 కోట్లు బకాయిలు చెల్లించింది. అప్పటి నుంచి ఒక సంవత్సరంలో చెల్లించవలసిన బకాయిలు మరుసటి సంవత్సరంలో చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన విధానమే. దానిని మేము తొలగించలేదు ఎటువంటి మార్పులు చేయలేదు. యధాతధంగా కొనసాగిస్తున్నాము. బకాయిలు పూర్తిగా తీరక పోవడానికి మరో కారణం విద్యాసంస్థలలో అడ్మిషన్లు ఒక నిరంతర ప్రక్రియగా మారిపోవడమే. డాని వలన ఈ చెల్లింపుల ప్రక్రియ కూడా నిరంతర ప్రక్రియగా మారిపోయింది.

విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకుండా ఎగవేయాలని మేము ఎన్నడూ ఆలోచించలేదు. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరంలో రూ.1,487 కోట్లు బకాయిలు చెల్లించాము. ఈ రెండున్నరేళ్ళలో రూ.4,687 కోట్లు చెల్లించాము. ఏటా దీని కోసం కనీసం 2-2500 కోట్లు వరకు నిధులు అవసరం ఉంటాయి. ఈ పధకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ మేము దానిని ఎందుకు కొనసాగిస్తున్నామంటే విద్యార్ధులకు నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే. 

ఈ చెల్లింపులలో అవినీతి జరుగుతున్నట్లు తెలియడంతో నేనే విజిలెన్స్ చేత దర్యాప్తు చేయించాను. విద్యార్ధుల కోసం ప్రభుత్వం ఇస్తున్న డబ్బు వారికే దక్కాలి తప్ప పక్క మార్గం పట్టకూడదనే ఉద్దేశ్యంతోనే దర్యాప్తు చేయించాను. ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై కటినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడను. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించక పోయినా ఊరుకొనేది లేదు. 

అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే ఏకంగా 370 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అలాగే బీఈడి కాలేజీలు కూడా అవసరం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమా? అవన్నీ కలిపి ఏటా వేలమంది ఇంజనీర్లను తయారుచేసి బయటకి పంపిస్తుంటే వారికి సరైన ఉద్యోగాలు దొరకక పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకొంటున్నారు. మన విద్యా వ్యవస్థలో ఉన్న ఈ లోపాలనన్నిటినీ సవరించి విద్యార్ధులకు మేలు చేసేందుకు మా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

కనుక విద్యార్ధుల ఫీజ్ రీయంబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో మా ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించనవసరం లేదు. నిజానికి వారి కంటే మాకే విద్యార్ధుల ఎక్కువ శ్రద్ధ ఉంది. దయచేసి విద్యార్ధులను రెచ్చగొట్టి వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 


Related Post