ఎవరు ముఖ్యమంత్రి?

January 04, 2017


img

ప్రస్తుతం తమిళనాడులో చాలా విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ పదవిని శశికళ చేపట్టాలని అన్నాడిఎంకె పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ఆమె తన ఆలోచనలను బయటపెట్టకుండా తెలివిగా పార్టీలో తన అనుకూల వర్గం చేత తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేయిస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగలోగానే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని, అందుకు ఆమె సిద్దపడితే పన్నీర్ సెల్వం వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చేయడానికి సిద్దంగా ఉన్నారని తమిళనాడులో ప్రచారం మొదలైంది. 

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి సెల్వం తన మనసులో ఆలోచనలను ఇంతవరకు బయటపెట్టలేదు. అసలు ఏమీ జరగనట్లు మౌనంగా చూస్తున్నారు. అయితే ఆయన తన పదవిని కాపాడుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేయకుండా ఉంటారనుకోలేము. బహుశః దాని కోసమే ఈ రోజు ఆయన అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లున్నారు. 

అధికార పార్టీలో శశికళ, సెల్వం మద్య ఈవిధంగా ఆధిపత్యపోరు సాగుతుంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికారం చేజిక్కించుకోవడానికి పావులు కదపడం మొదలుపెట్టింది. పన్నీర్ సెల్వం నాయకత్వంపై స్వంత పార్టీలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నందున ఆయన శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని డిఎంకె నేత స్టాలిన్ డిమాండ్ చేయడం విశేషం. 

234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో అధికార అన్నాడిఎంకె పార్టీకి 136 మంది సభ్యులు ఉండగా ప్రతిపక్ష డిఎంకె పార్టీ 98మంది సభ్యులున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. అంటే అన్నాడిఎంకె పార్టీలో నుంచి 20 మంది ఎమ్మెల్యేలు డిఎంకె పార్టీలోకి జంప్ చేసినట్లయితే రాష్ట్రంలో అధికారం తారుమారు అవుతుందన్నమాట. ఇవ్వాళ్ళ డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా స్టాలిన్ని ఎన్నికోబోతున్నారు. కనుక ఆయన తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికారంలో వచ్చే ప్రయత్నాలు చేయడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.

ఒకవేళ శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టే ప్రయత్నం చేసినట్లయితే, అన్నాడిఎంకె పార్టీలో ఆమెను వ్యతిరేకిస్తున్న సుమారు 20-40 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష డిఎంకె పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారికి పన్నీర్ సెల్వమే నాయకత్వం వహించినా ఆశ్చర్యం లేదు. అలా జరుగకూడదు అంటే, పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా కొనసాగనీయవలసి ఉంటుంది. కానీ  ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన శశికళ అందుకు అంగీకరిస్తారా లేదో త్వరలోనే తెలుస్తుంది.


Related Post