ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: ఏడాది ఫ్రీ

January 03, 2017


img

రిలయన్స్ సంస్థ జియో ఆఫర్ తో మార్కెట్లోకి ప్రవేశించే వరకు అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి మరీ చార్జీలు వసూలు చేసేవి. అయినప్పటికీ తాము నష్టాలలో ఉన్నామని బీద అరుపులు అరుస్తుండేవి. కానీ జియో ప్రవేశంతో దేశంలో అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగిరాక తప్పలేదు. జియో దెబ్బకి ఒక్కో సంస్థ బారీగా చార్జీలు తగ్గించి మొబైల్ సేవలు అందించడానికి ముందుకు రావడం గమనిస్తే, అవి ఇంతకాలం ప్రజలను ఏ స్థాయిలో దోచుకొన్నాయో ఆర్ధం చేసుకోవచ్చు. 

జియో సంస్థ మార్చి 31వరకు వెల్ కమ్ ఆఫర్ ని ప్రజలకు అందిస్తుంటే, ఎయిర్ టెల్ ఏకంగా ఒక సంవత్సరం ఉచిత ఆఫర్ ప్రకటించింది. రేపటి నుంచి ప్రారంభం అయ్యే ఈ ఉచిత ఆఫర్ ఈ ఏడాది డిశంబర్ 31 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ లో భాగంగా ప్రీ పెయిడ్ వినియోగదారులు రూ.345తో రీ-చార్జ్ చేసుకొంటే నెలకి అపరిమిత 4జి కాల్స్ మరియు 1 జిబి డాటా పొందవచ్చు. ఇతర ప్లాన్స్ లో 3జిబి డాటా పొందవచ్చు. ప్రస్తుతం 3జిలో ఉన్నవారు 4జికి అప్-గ్రేడ్ కావలసి ఉంటుంది. ఈ ఆఫర్ పొందాలంటే తప్పనిసరిగా 4జి మొబైల్ హ్యాండ్ సెట్ కలిగి ఉండాలి, ఫిబ్రవరి 28వ తేదీలోగా ఎయిర్ టెల్ సిమ్ తీసుకోవలసి ఉంటుంది. ప్రీ పెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ లో కొన్ని ఎంపిక చేసిన ప్లాన్స్ కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఎయిర్ టెల్ ప్రకటించిన ఈ ఆఫర్ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, రిలయన్స్ సంస్థ తన జియో ద్వారా పూర్తిగా ఉచితంగా ఫ్రీ 4జి కాల్స్, రోజుకి 1జిబి డాటా, ఇంకా అనేక సౌకర్యాలు అందజేస్తున్నప్పుడు ఎయిర్ టెల్ కి మారవలసిన అవసరమేమిటి? పైగా మార్చి 31 తరువాత మరొక మూడు నెలలు ఈ ఉచిత ఆఫర్ ని పొడిగించవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పొడిగించకపోయినా నెలకు కేవలం రూ.149కే అపరిమిత కాల్స్, పరిమితమైన డాటా అందిస్తామని జియో ప్రకటించినప్పుడు, రూ.345పెట్టి ఎయిర్ టెల్ ఎందుకు తీసుకొంటారు? 

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తమ ధరలను ఉంచగలిగితే అందరూ తమ వైపు మొగ్గుతారని రిలయన్స్ సంస్థ గ్రహించబట్టే తన కనీస ధరను రూ.149గా ప్రకటించింది. ఇంతవరకు ఏకచత్రాధిపత్యం వహిస్తూ వచ్చిన బి.ఎస్.ఎన్.ఎల్. కూడా నెలకు రూ.149 ఆఫర్ తో రాబోతోంది. కనుక ఆ ధరకి ఏ సంస్థ సేవలు అందించగలవో అవే మార్కెట్ ని స్వంతం చేసుకోగలవు. 


Related Post