తెరాసలో నుంచి కాంగ్రెస్ లోకి వలసలు?

January 03, 2017


img

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు తెరాసలోకి ఫిరాయించినప్పుడు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనయిపోయిందనే అందరూ అనుకొన్నారు. ఆ వలసల వలన కాంగ్రెస్ కొంత బలహీనపడినప్పటికీ మళ్ళీ కోలుకొని నిలబడటమేకాకుండా తెరాస ప్రభుత్వానికి గట్టిగా సవాలు విసురుతోంది కూడా. “వచ్చే ఎన్నికలలో ఆ అవశేష కాంగ్రెస్ పార్టీతోనే మాకు పోటీ ఉంటుందని” మంత్రి కేటిఆర్ చెప్పడం గమనిస్తే కాంగ్రెస్ బలాన్ని తెరాస కూడా తక్కువగా అంచనా వేయడం లేదని అర్ధం అవుతోంది. ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేర్చుకొంటునప్పుడు దానిని బంగారి తెలంగాణా సాధన కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. అలాగా తెరాసలో చేరినవారిలో కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన అనుచరులు కూడా ఉన్నారు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్ళిపోబోతున్నరంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కానీ అయన అనుచరులు మాత్రం అప్పుడే రిటర్న్ జర్నీ మొదలుపెట్టేశారు. ఆయన కూడా ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివచ్చేస్తారా లేదా అనే సంగతి రానున్న రోజులలో తెలుస్తుంది.        

దామచర్ల జెడ్.పి.టి.సి.శంకర్ నాయక్ నేతృత్వంలో మిర్యాలగూడాకు చెందిన కొందరు జెడ్.పి.టి.సి.లు,సర్పంచులు మొన్న టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రెండు నెలల క్రితం నల్గొండ జిల్లాలోనే తెరాస జెడ్.పి. వైస్ చైర్మన్ కె.లింగారెడ్డి, పెద్దాపూర్ నుంచి టి.శ్రీకర్ రెడ్డి, 11 మంది సర్పంచులు, 8 మంది ఎంపిటిసిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు మైనార్టీ కార్యకర్తలు పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

ఆ స్థాయి నేతలు, కార్యకర్తలు వారు తెరాసను వీడటం వలన పార్టీకి నష్టమేమీ లేకపోయినా అది పార్టీలో అసంతృప్తి నెలకొని ఉందనే దానికి సంకేతంగా భావించవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాలు పునర్విభజన జరిగి శాసనసభ స్థానాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చినందునే ఇతర పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. కానీ ఆ అవకాశం లేదని కేంద్రప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తోంది. బంగారి తెలంగాణా కోసమే తెరాసలో చేరామని చెప్పుకొన్నవారందరూ వచ్చే ఎన్నికలలో తమకి టికెట్స్ దొరకవని అనుమానం కలిగిననాడు మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టవచ్చు. కనుక ఈ ఏడాది చివరి నుంచి మళ్ళీ రాజకీయ పునరేకీకరణ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది.


Related Post