చిన్నమ్మ మరీ ఇంత స్పీడా?

January 02, 2017


img

తమిళనాడులో అతి త్వరలోనే మళ్ళీ ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జయలలిత చనిపోయిన కొద్ది రోజులకే అన్నాడిఎంకె పార్టీ పగ్గాలను సునాయాసంగా చేజిక్కించుకొన్న శశికళ ఇప్పుడు ప్రభుత్వ పగ్గలాను అంటే ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. 

ఆమెను తక్షణమే ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరుతూ ఈరోజు ఆ పార్టీ ఒక అధికారిక ప్రకటన ద్వారా కోరింది. ప్రభుత్వం, పార్టీ పగ్గాలు ఒకరిచేతిలో ఉన్నప్పుడే రెండూ మంచి సమన్వయంతో పనిచేయగలవని కనుక ఆమె ముఖ్యమంత్రి పదవి చెప్పట్టాలని ఆ ప్రకటన ద్వారా కోరింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం చేయాలనుకొన్న పనులన్నిటినీ ఆమెకు అత్యంత సన్నిహితంగా మెలిగిన శశికళ అయితేనే చక్కగా సమర్ధంగా చేయగలరని ఆ ప్రకటనలో పేర్కొంది. 

శశికళకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందనే సంగతి ఇప్పటికే బహిర్గతం అయ్యింది. ముందుగా పార్టీ పగ్గాలు చేజిక్కించుకొని, వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవడానికి కూడా తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారని ఈ ప్రకటన ద్వారా స్పష్టం అవుతోంది. ఆమె అనుమతి లేనిదే పార్టీ తరపు నుంచి అటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉండదు కనుక ఆమె సూచన మేరకే అది వెలువడినట్లు చెప్పవచ్చు. ఈ ప్రకటన ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి కమ్మని శశికళ తనను తాను అభ్యర్దించుకొన్నట్లుంది. 

పార్టీలో సీనియర్ నేత, మరియు లోక్ సభ సభ్యుడు ఎం.తంబిదురై విడుదల చేశారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం మంత్రివర్గంలో అరడజనుకుపైగా మంత్రులు, సుమారు 100 మందికి పైగా శాసనసభ్యులు శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని బహిరంగంగానే కోరుతున్నారు. 

ఒకవేళ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమెతో రాజీకి సిద్దపడితే అధికార మార్పిడి చాలా సులువుగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆయనకు ఆర్ధికమంత్రి పదవిని దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన శశికళని వ్యతిరేకించినట్లయితే వారిద్దరి మద్య ఆధిపత్యపోరు మొదలయ్యే అవకాశం ఉంది. చాలా అవలీలగా పార్టీ పగ్గాలు చేజిక్కించుకొన్న శశికళ, పన్నీర్ సెల్వంని కూడా పక్కకి తప్పించగల శక్తి కలిగిఉన్నట్లు అర్ధమవుతూనే ఉంది. 

ఒకవేళ పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం పార్టీని చీల్చడానికి సిద్దపడినట్లయితే, భాజపా లేదా ప్రతిపక్ష డిఎంకె పార్టీల ఆయనకి అండగా నిలబడే అవకాశం ఉంది. కానీ ఇంత జరుగుతున్నా పన్నీర్ సెల్వం శశికళకు ఎదురుతిరిగే ప్రయత్నాలు చేయకపోవడం గమనించినట్లయితే, ఆయన శశికళకు సరెండర్ అయిపోయి ఆర్ధిక మంత్రి పదవితోనే సంతృప్తి పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. శశికళ స్పీడు చూస్తుంటే బహుశః మరొక వారం పది రోజులలోనే తాడోపేడో తేల్చేసేలా ఉన్నారు. 


Related Post