ఆ డొక్కు సైకిల్ ఎవరికి దక్కుతుందో?

January 02, 2017


img

ఒక పాత డొక్కు సైకిల్ కోసం తండ్రికొడుకులు కీచులాడుకోవడం ఎవరూ చూసి ఉండరు. కానీ యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఇద్దరూ తమ పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తు కోసం కీచులాడుకొంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద పోటాపోటీగా వాదోపవాదాలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాలు ఈసీ ముందు తమ వాదనలను గట్టిగా వినిపించేందుకు ప్రముఖ లాయర్లను రంగంలోకి దింపారు. ఈసీ దానిపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

అఖిలేష్ ని పార్టీ నుంచి ఆరేళ్ళపాటు సస్పెండ్ చేస్తున్నట్లు నాలుగు రోజుల క్రితమే ములాయం ప్రకటించారు. కానీ ఆ మరునాడే వారిరువురూ రాజీపడటంతో దానిని ఉపసంహరించుకొన్నారు. కానీ అఖిలేష్ నిన్న లక్నోలో పార్టీ జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. దానికి పార్టీలో ఉన్న 229 మంది ఎమ్మెల్యేలలో 220 మంది, 30 ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. వారందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్ష పదవుల నుంచి ములాయం, శివపాల్ యాదవ్ లను తొలగిస్తూ తీర్మానం చేసి, వారి స్థానాలలో జాతీయ అధ్యక్షుడుగా అఖిలేష్ ని, రాష్ట్ర అధ్యక్షుడుగా అతని అనుచరుడు ఎమ్మెల్సీ నరేష్ ఉత్తం పటేల్ ని నియమించారు. అమర్ సింగ్ కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, పార్టీని పూర్తిగా తమ స్వాధీనం చేసుకోవడానికి సమావేశంలో తీర్మానం చేశారు.

తండ్రీకొడుకులు ఇద్దరూ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ ఒకరినొకరు బహిష్కరించుకొంటున్నారు. ఇప్పుడు పార్టీపై ఆధిపత్యం కోసం కీచులాడుకొంటున్నారు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులు, రెండువర్గాలుగా చీలిపోయి ఘర్షణలు పడుతున్న అధికార పార్టీ సభ్యులను అదుపు చేయవలసి వస్తోంది.

రాష్ట్రాన్ని పాలించమని సమాజ్ వాదీ పార్టీకి అధికారం కట్టబెడితే, వారు రాష్ట్రాన్ని పాలనను గాలికొదిలేసి వారిలో వారే కుమ్ములాడుకోవడం చూసి రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ సంగతి బహుశః వారికీ తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ ఈసారి కూడా తప్పకుండా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఇరు వర్గాలు గట్టిగా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ ఎవరికి దక్కితే వారు తిరిగి అధికారంలోకి వచ్చేయడం ఖాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కానీ ఆ సైకిల్ ఎప్పుడో తుప్పు పట్టి పోయిందని, దానికి ఎన్ని రిపేర్లు చేసినా అది పనిచేయదని రాహుల్ గాంధీ ఇదివరకే చెప్పారు. ఆ డొక్కు సైకిల్ కోసం తండ్రీకొడుకులు ఇద్దరూ కీచులాడుకొంటున్నారిప్పుడు. తుప్పు పట్టిపోయిన ఆ డొక్కు సైకిల్ ఇప్పుడు ఎవరికి దక్కుతుందో చూడాలి. 


Related Post