తండ్రీకొడుకులు కలిసి డ్రామాలాడుతున్నారా?

December 31, 2016


img

మన తెలుగు సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా యూపి అధికార పార్టీలో నాటకీయ సన్నివేశాలు సాగుతున్నాయి. అవి చూస్తుంటే తండ్రికొడుకులు నిజంగానే కీచులాడుకొంటున్నారా లేకపోతే ప్రజలని, తమ రాజకీయ ప్రత్యర్దులని అందరినీ మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ డ్రామాలు ఆడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. 

యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్ నిన్న సాయంత్రం పార్టీ నుంచి ఆరేళ్ళపాటు బహిష్కరించారు. అఖిలేష్ యాదవ్ ఈరోజు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. పార్టీలో ఉన్న మొత్తం 229 మందిలో 190 మంది ఆ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. అంతవరకు బాగానే ఉంది. 

ఆ సమావేశంలో అఖిలేష్ చెప్పిన మాటలే ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించి దానిని పెద్దాయన అంటే తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కి బహుమతిగా ఇద్దామని అన్నారు. తండ్రి తనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మళ్ళీ ఆయనకి ఈ బహుమానం ఇద్దామని చెప్పడం చూస్తే, కొడుకుకి ప్రజల సానుభూతి దక్కేలా చేయడం కోసమే పెద్దాయన ఈ సస్పెన్షన్ డ్రామా రచించారేమో అనే అనుమానం కలుగుతోంది. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ కే ఎక్కువ ప్రజాధారణ ఉందని రాష్ట్రంలో ఇప్పటికే చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ తండ్రికొడుకులిద్దరూ కలిసే పార్టీని గెలిపించుకోకుండా ఎందుకు కీచులాడుకొంటున్నారు? అనే ప్రశ్నకు ఆ రాష్ట్రం గురించి బ్రీఫింగ్ అవసరం.  

దేశంలో అనేక చిన్నా పెద్ద రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి సాధిస్తుంటే దేశంలో కెల్లా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మాత్రం అన్ని రంగాలలో వెనుక బడిపోయింది. దాని కంటే అన్ని విధాల బ్రష్టుపట్టిన బిహార్ కూడా ఇప్పుడు అభివృద్ధి పధంలో దూసుకుపోతోంది. ఈ ఐదేళ్ళలో యూపి పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయింది అంటే ఎక్కడ ఎప్పుడు చూసినా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలే. హత్యలు, మానభంగాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆ కారణంగానే సమాజ్ వాదీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని కొన్ని నెలల క్రితం ప్రకటించిన సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. మూడు సంస్థలు వేర్వేరుగా చేసిన సర్వేలలో మూడూ కూడా భాజపాకే విజయావకాశాలు ఉన్నాయని చెప్పాయి. 

సరిగ్గా అప్పటి నుంచే సమాజ్ వాదీ పార్టీలో ఈ తండ్రికొడుకుల గొడవల డ్రామాలు మొదలయ్యాయి. ఆ కారణంగా పార్టీ ఇంకా నష్టపోయే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. కానీ అఖిలేష్ యాదవ్ నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ఇంతవరకు ప్రజలలో పార్టీపై, అతని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాస్తా సానుభూతిగా మారే అవకాశం ఏర్పడింది. తాజా వార్తలు కూడా అవే నిర్ధారిస్తున్నాయి. 

అఖిలేష్ యాదవ్ ఈ రోజు తన మద్దతుదారులతో సమావేశం అయిన తరువాత అక్కడి నుంచి నేరుగా తన తండ్రి వద్దకే వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం గమనిస్తే, తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి  ఈ డ్రామాలు ఆడుతున్నారనే అనుమానం కలుగుతోంది. 

తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నందున దానిని అధిగమించి, తమకు సవాలు విసురుతున్న భాజపా, బి.ఎస్.పి అధినేత్రి మాయావతిని నిలువరించేందుకే తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ డ్రామా ఆడుతున్నట్లు అనుమానం కలుగుతోంది. 

ఒకవేళ ఈ ఊహలు నిజమైతే ములాయం సింగ్ యాదవ్ తన కొడుకుపై ఇంకా తీవ్రమైన చర్యలు చేపట్టవచ్చు అదే సమయంలో అఖిలేష్ యాదవ్ శ్రీరామచంద్రుడుకి తను ప్రతిరూపం అన్నట్లుగా తన తండ్రిపట్ల, పార్టీ పట్ల ఇంకా ఎక్కువ గౌరవం ప్రదర్శిస్తూ ఎన్నికల బరిలో దిగవచ్చు. తద్వారా వారిద్దరూ కలిసి ప్రజలను భాజపా, బీ.ఎస్.పి.ల వైపు చూడకుండా అందరి దృష్టి తమ మీదే ఉండేలా చేసు కొంటూ వారి ఓట్లన్నీ తమ మద్యనే చీలిపోయేలా చేయగలిగితే మళ్ళీ సమాజ్ వాదీ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 

అప్పుడు తండ్రీకొడుకులు మళ్ళీ ఏకం అయిపోయినా అడిగేవారుండరు. ఇదే వారి వ్యూహం అయినట్లేయితే భాజపా, బి.ఎస్.పి.లు దానిని ఏవిధంగా చేధిస్తాయో చూడాలి. 


Related Post