తెరాస, భాజపాలు దగ్గరవుతున్నాయా?

December 31, 2016


img

నోట్ల రద్దు నిర్ణయాన్ని భాజపాకి మిత్రపక్షంగా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉన్న తెదేపా, దాని అధినేత చంద్రబాబు కంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే గట్టిగా సమర్దిస్తున్నారని చెప్పకతప్పదు. మోడీ దేశహితం కోసమే అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారా లేకపోతే వచ్చే ఎన్నికలలో భాజపాతో పొత్తులు పెట్టుకొని కేంద్రప్రభుత్వంలో భాగస్వామి కావాలనే ఉద్దేశ్యంతో సమర్ధిస్తున్నారా అనేది కాలమే చెపుతుంది. తెరాస, భాజపాల పొత్తులు గురించి మాట్లాడుకొనేందుకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అందుకు అనుకూలంగానే కనబడుతోంది.

రాష్ట్రంలో తెదేపా, భాజపాలు దూరం అయ్యి చాలా కాలమే అయినందున వచ్చే ఎన్నికలలో తెరాస, భాజపాలు జత కట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో భాజపా, తెరాసాలు బద్ద శత్రువులుగా వ్యవహరించేవి. కానీ ఇప్పుడు పరస్పర అవగాహన కుదిరిన మంచి మిత్రులు లాగ వ్యవహరిస్తున్నాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని తెరాస గట్టిగా సమర్ధిస్తే, తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకి భాజపా పెద్దగా వ్యతిరేకత తెలుపకపోవడమే అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే వాటి మద్య పొత్తుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్నందునే అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించలేదు తప్ప వాటి మద్య ఇప్పుడు సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. భాజపా ఇదివరకులాగా రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం మేమే వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకడం మానుకొంది. ఎటువంటి స్నేహం, పొత్తులు లేనప్పుడే వాటి మద్య చక్కటి స్నేహసంబంధాలు, పరస్పర సహకారం కనబడుతోంది. 

తెరాస, భాజపాలు జతకడితే దాని వలన ఆ రెండు పార్టీలే కాక రాష్ట్రానికి కూడా మేలే కలుగుతుంది. ఒకప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ నిధుల విడుదల, అభివృద్ధి పనులు ఇంత జోరుగా సాగేవి కావు. కానీ ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ వాటి మద్య చక్కటి అవగాహన, అన్నిటికంటే మించి చాలా ఆరోగ్యకరమైన సంబంధాలు కనిపిస్తున్నాయి. 


Related Post