మోడీ, కాంగ్రెస్ పాలనలో తేడా అదే!

December 31, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న డిల్లీలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనకు, తన ప్రభుత్వ పాలనకు మద్య ఉన్న కొన్ని వ్యత్యాసాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. “కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేపరు తిరగేసినా టీవీ ఛానల్ పెట్టుకొన్నా ఏదో ఒక కుంభకోణం గురించి..దానిలో ఎంత డబ్బు ఎవరెవరు దిగమింగారు…దానికి సంబందించిన వార్తలే కనిపించేవి. కానీ ఇప్పుడు నల్లకుభేరుల దగ్గర ఎంత డబ్బు, బంగారం పట్టుబడింది..వారు బ్యాంకులలో ఎన్ని కోట్లు జమా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణల గురించి ఒక్క వార్త కూడా కనబడదు. అలాగే ఒకప్పుడు ఎన్నికలలో గెలిచేందుకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంచుతున్నామని ప్రకటించేవారు కానీ మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సీడిని వదులుకోమని అడుగుతోంది. మేము గ్యాస్ సబ్సిడీ వదులుకోవలసిందిగా ప్రజలను కోరితే ఒక కోటి 20లక్షల మంది సబ్సిడీని వదులుకొన్నారు” అని మోడీ వివరించారు. 

అవినీతి విషయంలో మోడీ చెప్పిన మాటలు 100 శాతం నిజమని అంగీకరించక తప్పదు. మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏనాడూ ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. ఆవిషయం మోడీ, ఆయన మంత్రులు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వంలో జరిగిన ఒక్క అవినీతిని వెతికి పట్టుకొని చూపించలేకపోతున్నారు. కనీసం మోడీ చెపుతున్న మాటలను వారు ఖండించలేకపోతున్నారు. అందుకే, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో అవినీతికి పాల్పడ్డారంటూ ఒక కాగితం ముక్క పట్టుకు వచ్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే దానిలో కూడా మళ్ళీ కాంగ్రెస్ నేత, మాజీ డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు కనబడింది. మోడీ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు నిరూపించలేక చివరికి నోట్ల రద్దు నిర్ణయమే అతిపెద్ద అవినీతి అంటూ కాంగ్రెస్ తో దాని మిత్రపక్షాలు పాట పాడటం మొదలుపెట్టాయి. కానీ దానితో మోడీ ప్రభుత్వం ఏవిధంగా అవినీతికి పాల్పడిందో వివరించలేకపోతున్నాయి. పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనబడినట్లే, అవినీతి, కుంభకోణాలకు అలవాటుపడిన కాంగ్రెస్ నేతలకు కూడా మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా అవినీతిమయంగానే కనిపిస్తాయి. కానీ ఎక్కడా తప్పుపట్టుకోలేక సతమతమవుతోంది.     

కాంగ్రెస్ పాలన అంటే అవినీతి, అసమర్ధత, అశ్రద్ద, కుంభకోణాలే తప్ప అభివృద్ధి, డాని కోసం ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలదనే భావన ప్రజలలో కల్పించలేకపోయింది. కానీ మోడీ వచ్చిన తరువాత పాలన అంటే దేశ ప్రజలకు రుచి చూపిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినందున, మోడీ చేపడుతున్న సంస్కరణలు, తీసుకొంటున్న కటిన నిర్ణయాల ఫలాలు దేశ ప్రజలకి అందడానికి మరికొంత సమయం పట్టవచ్చు.


Related Post