మరో ముఖ్యమంత్రి పార్టీ నుంచి సస్పెండ్!

December 30, 2016


img

2016 సంవత్సరం ముగింపులో చాలా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుని ఆయన పార్టీ బహిష్కరిస్తే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆరేళ్ళ పాటు శుక్రవారం సాయంత్రం సస్పెండ్ చేశారు. అతనితో పాటు కొడుకుకి మద్దతు ఇస్తున్న రాం గోపాల్ యాదవ్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

వచ్చే మార్చిలో జరుగబోయే యూపి అసెంబ్లీ ఎన్నికల కోసం ములాయం సింగ్ నిన్న 325మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించారు. దానిలో అఖిలేష్ వర్గానికి చెందిన వారెవరికీ టికెట్స్ కేటాయించకపోవడంతో, అఖిలేష్ యాదవ్ కూడా ఇవ్వాళ్ళ పోటీగా మరో జాబితాను ప్రకటించాడు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన ములాయం సింగ్ యాదవ్ కొడుకును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతనిని ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తొలగించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

మరొక మూడు నెలలలో ఎన్నికలు ఉండగా అధికార పార్టీలో ఇటువంటి తీవ్ర సంక్షోభం రావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆ సూచనలు  గత ఆరేడు నెలల నుంచే కనబడుతున్నాయి. ములాయం కుటుంబ సభ్యుల మధ్య  జరుగుతున్న గొడవలను పూర్తిగా పరిష్కరించుకోకుండా ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టుకొంటూ కాలక్షేపం చేయడం వలననే ఈ సమస్య ఇంత తీవ్రమైంది.

అఖిలేష్ యాదవ్ స్వంత కుంపటి పెట్టుకోవడానికి చాలా కాలం క్రితమే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాడు కనుక రేపో మాపో ఆ సంగతి ప్రకటించవచ్చు.  అధికార పార్టీలో నెలకొన్న ఈ సంక్షోభం భాజపా, బి.ఎస్.పి.ల విజయావకాశాలు మెరుగుపరుస్తున్నట్లే భావించవచ్చు. 


Related Post