మూడు రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం

December 30, 2016


img

యూపి, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అధికార పార్టీలలో సంక్షోభం ఏర్పడటం చాలా విచిత్రంగా ఉంది. యూపిలో తండ్రీకొడుకులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుంటే, అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పెమా ఖండు వర్గం, వారి పిపిఏ పార్టీ అధిష్టానం కత్తులు దూసుకొంటున్నాయి. ఇక తమిళనాడులో శశికళ వర్సస్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఫైట్ జరుగుతుందనుకొంటే, శశికళ నాగరాజన్ వర్సస్ శశికళ పుష్ప ఫైట్ మొదలవడం విశేషం. 

వచ్చే మార్చ్ నెలలో యూపి అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కి మద్య టికెట్ల పంపిణీ వ్యవహారంలో ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. మొదట అఖిలేష్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకోవడానికి సిద్దపడ్డాడు కానీ ఎందుకో పార్టీనే అంటిపెట్టుకొని ఉండాలని నిర్ణయించుకొన్నాడు. కానీ తను కోరుకొన్న అభ్యర్ధులకు డాడీ టికెట్స్ నిరాకరించడంతో రెబెల్స్ ని బరిలో దింపడానికి సిద్దం అవుతున్నాడు. ఆ కారణంగా తండ్రీకొడుకుల మద్య గొడవలు జరుగుతున్నాయి. 

ఇక అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, భాజపాల మధ్య జరుగుతున్న కుమ్ములాటల కారణంగా అధికార పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో ముసలం పుట్టింది. ఆ కారణంగా ముఖ్యమంత్రి పెమా ఖండూని పార్టీ సస్పెండ్ చేస్తే ఆయనకి భాజపా మద్దతుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక తమిళనాడులో శశికళ నటరాజన్ పార్టీపై తన పట్టు నిరూపించుకొని, పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరు కాకుండానే పార్టీ పగ్గాలు దక్కించుకొన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వయంగా ఆమె వద్దకు వెళ్ళి ఆ విషయం విన్నవించుకోవడం గమనిస్తే ఆయన తన పదవిని కాపాడుకోవడానికి ఆమెకి సరెండర్ అయిపోయినట్లే ఉన్నారు. వారిద్దరూ చేతులు కలిపినట్లయితే, ఇక భాజపా తమిళనాడు రాజకీయాలలో తలదూర్చడం కష్టమే. కానీ ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకొంటే మళ్ళీ ఇటువంటి అవకాశం మరొకసారి రాకపోవచ్చు. ఒకసారి వారిద్దరూ రాష్ట్రంలో రాజకీయంగా బలపడినట్లయితే ఇక భాజపా ఎన్నటికీ ఆ రాష్ట్రానికి దూరంగానే ఉండిపోక తప్పదు. కనుక త్వరలోనే అది కూడా పావులు కదపడం ఖాయమనే భావించవచ్చు. 


Related Post