ఆ గణాంకాలు జైట్లీయే చెప్పాలా?

December 29, 2016


img

ఈ మూడేళ్ళ పాలనలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సత్తా ఏపాటిదో తెలుసుకొనే అవకాశం ప్రజలకు కలుగలేదు. కానీ నోట్ల రద్దు పుణ్యమాని అయన ఒక డమ్మీ మంత్రి అనే సంగతి బయటపడింది. దేశంలో ఏర్పడిన నగదు సంక్షోభాన్ని ఆయన నివారించలేకపోవచ్చు కానీ కనీసం దాని తీవ్రతనయినా ఏమాత్రం తగ్గించలేకపోయారు.

ఈ రెండు నెలలో అయన చేసిన గొప్ప పని ఏమిటంటే అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి “రిజర్వ్ బ్యాంక్ వద్ద కావలసినంత కరెన్సీ ఉంది. ప్రజలు భయపడనవసరం లేదు,” అని ప్రకటనలు చేయడమే. దానికే ఆయన పరిమితం అయినట్లున్నారు. కానీ ఆయన చెప్పినట్లుగా సక్రమంగా నగదు సరఫరా జరిగి దేశంలో నగదు కొరత సమస్య కొంచెం తక్కువగా ఉన్నా ఆయన మాటలకు విలువ ఉండేది కానీ నేటికీ అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

ఆ సంగతి తెలిసి ఉన్నప్పటికీ ఇవ్వాళ్ళ కూడా అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అదే పాట పాడారు. త్వరలోనే చాలా బారీ స్థాయిలో రూ.500 నోట్లని బ్యాంకులకి పంపిణీ చేస్తామని చెప్పారు. నగదు కొరత కారణంగా దేశంలో ఎక్కడా అశాంతి నెలకొని ఉన్నట్లు వార్తలు రాలేదని అరుణ్ జైట్లీ చెప్పడం విశేషం. ఈ నిర్ణయం తరువాత దేశంలో డిశంబర్ 19వరకు ప్రత్యక్ష పన్నులు 14.4 శాతం, పరోక్ష పన్నులు 26.2 శాతం, కస్టమ్స్ 6 శాతం, సెంట్రల్ ఎక్సైజ్ ద్వారా ఏకంగా 43.3 శాతం ఆదాయం పెరిగిందని చెప్పారు. త్వరలోనే నగదు కొరత సమస్య తగ్గుముఖం పడుతుందని చెప్పారు. ఇన్ని రోజులుగా కేంద్రప్రభుత్వానికి సహకరించిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

ఈ గణాంకాలు మీడియాకి చెప్పడానికి అరుణ్ జైట్లీయే అవసరం లేదు. ఆర్ధిక శాఖలో ఉన్న ఏ అధికారి అయినా చెప్పగలడు. దేశ ఆర్దికమంత్రి నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఈ గణాంకాలు కాదు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొంటోంది...ఇంకా ఎన్ని రోజులలో ఈ నగదు కొరత సమస్యలు తీరుతాయో ఆయన చెప్పాలని ఎదురు చూశారు. కానీ అరుణ్ జైట్లీ దేశంలో సామాన్య ప్రజల ఆగ్రహావేశాలను అసలు గుర్తించనట్లు మాట్లాడారు. 

ఆయన త్వరలో కరెన్సీ సరఫరా బారీగా పెరుగుతుందని చెపుతున్న సమయంలోనే రిజర్వ్ బ్యాంక్ లోని నోట్ల ముద్రణాలయంలో పని చేసే ఉద్యోగులు ఇక నుంచి రోజుకి 12గంటలు చేయలేమని, రోజుకి 9 గంటలు మాత్రమే పని చేస్తామని ప్రకటించారు. ఆ కారణంగా రోజుకి రూ.60 లక్షల కరెన్సీ ముద్రణ తగ్గుతుంది. మరి ఈ సంగతయినా అరుణ్ జైట్లీకి తెలుసో తెలియదో? 


Related Post