దీక్ష విరమించినా ఫైట్ కంటిన్యూ

December 29, 2016


img

తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తన ఒక్కరోజు నిరాహార దీక్ష గురువారం సాయంత్రం విరమించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నిమ్మరసం ఇచ్చి ఆయన చేత  దీక్ష విరమింపజేశారు. అనంతరం ప్రొఫెసర్  కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ తీసుకువచ్చిన భూసేకరణ చట్టం వలన నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందే తప్ప న్యాయం జరుగదు. అది దోపిడీకి చట్టబద్దత కల్పించడమే తప్ప మరొకటి కాదు. అందుకే మేము దానిని వ్యతిరేకిస్తున్నాము. నష్టపరిహారం గురించి తెరాస సర్కార్ కాకి లెక్కలు చెపుతోంది. భూసేకరణకు ముందు అక్కడ భూముల మార్కెట్ ధరలను పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చిన ధరలను నిర్ణయించి దానినే రైతులు పుచ్చుకొని తమ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని ఒత్తిడి చేస్తోంది.

మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు బెదిరించి, భయబ్రాంతులను చేసి భూములు గుంజుకోవాలని ప్రయత్నిస్తుంటే వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోతుంటే మేము వారి తరపున  ప్రభుత్వానికి హైదరాబాద్ లో నిరసన తెలియజేయాలని ప్రయత్నిస్తే మమ్మల్ని కూడా అడ్డుకొని అరెస్టులు చేయించింది. చివరికి ఇళ్ళలో ఉన్న మా జెఎసి నేతలను కూడా పోలీసులు పట్టుకుపోయి అరెస్టులు చేయవలసిన అవసరం ఏమిటి? తెరాస సర్కార్ కి తనమీద తనకే నమ్మకం లేనట్లుంది. అందుకే ఇళ్ళలో ఉన్నవారిని కూడా పట్టుకుపోయి అరెస్టులు చేస్తోంది.

తెరాస సర్కార్ తెచ్చిన భూసేకరణ బిల్లు రాష్ట్రంలో నిరుపేద రైతులని దోచుకోవడానికే తప్ప వారికి ఏమాత్రం మేలు చేయదు. అది సరికాదని చెపుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అంత పట్టుదలగా దానిని అమలుచేయాలని ప్రయత్నిస్తోంది? అసలు ప్రజల తరపున మేము ఏమి చెపుతున్నామో కూడా వినేందుకు తెరాస సర్కార్ ఎందుకు ఇష్టపడటం లేదు?” అని ప్రొఫెసర్  కోదండరామ్ తెరాస సర్కార్ ని నిలదీశారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నిర్వాసితుల తరపున తాము తప్పకుండా తెరాస సర్కార్ తో పోరాడుతామని, వారికీ నయం చేసేవరకు విశ్రమించబోమని ప్రొఫెసర్  కోదండరామ్ స్పష్టం చేశారు. అంటే ఇక ముందు తెరాస సర్కార్, తెలంగాణా జెఎసి మద్య పోరాటం మరింత ఉదృతం కాబోతోందని స్పష్టం అవుతోంది. 



Related Post