ప్రధాని మోడీ ఈసారి ఏమి చెపుతారో?

December 29, 2016


img

నవంబర్ 8న పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశ ప్రజలకి పెద్ద షాక్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ఈనెల 31న సాయంత్రం 7.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించబోతున్నారని తాజా సమాచారం. ఈ రెండు నెలలలో దేశంలోని 125 కోట్లు మంది ప్రజలు, అనేక లక్షల వ్యవస్థలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్నపుడు, వివిధ వేదికల ద్వారా ఆయన ప్రజలకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్, అనేకమంది కేంద్రమంత్రులు చెప్పిన్నట్లుగా ప్రజల సమస్యలు నేటికీ తగ్గలేదు. 

ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విదించుకొన్న 50 రోజుల గడువు పూర్తయినప్పటికీ ఇంకా అనేక నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలలో, పల్లెల్లో ప్రజలు, సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. వివిధ వ్యవస్థల పరిస్థితి ఇంకా దయనీయంగానే కొనసాగుతోంది. కనుక ఈసారి తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొని ఉంది. 

అసలు డిశంబర్ 30 తోనే పాత నోట్ల గడువు ముగుస్తుంది కనుక ఆలోగా తప్పకుండా కేంద్రప్రభుత్వం ప్రకటన చేయవలసి ఉంది. డిశంబర్ 31 నుంచి ప్రజలు బ్యాంకులలో ఉన్న తమ నగదుని తీసుకోనేందుకు వీలు కల్పిస్తారా లేకపోతే ఇంకా మరికొన్ని రోజుల పాటు నిబందనలు, ఆంక్షలు కొనసాగిస్తారా? అనేది తెలియవలసి ఉంది. దీని గురించి అరుణ్ జైట్లీ, శక్తికాంత్ దాస్ లేదా ఉర్జీత్ పటేల్ ముగ్గురిలో ఎవరో ఒకరు ఇప్పటికే ఒక ప్రకటన చేసి ఉండాలి కానీ ఎందువల్లో ఇంకా చేయకపోవడంతో దేశప్రజలు అందరూ దాని కోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అది వెలువడినట్లయితే దానిని బట్టి ఆ మరునాడు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఏమి చెప్పబోతున్నారో కొంత ఊహించవచ్చు. 


Related Post