శాసనసభకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేకపోతే...

December 29, 2016


img

పెళ్ళి కానంతవరకు కాలేదనే చింత..అయ్యాక ఎందుకు చేసుకొన్నామా...అని చాలా మంది బాధపడుతున్నట్లుగా,   పార్లమెంటు, శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించనంతవరకు అవి ఇంకా నిర్వహించలేదేమిటి? నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందంటూ ప్రతిపక్షాలు తెగ విమర్శలు గుప్పిస్తుంటాయి. నిర్వహించిన తరువాత ఏదో ఒక సమస్య లేదా అంశం పట్టుకొని సభని స్తంభింపజేయడమో లేదా సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటకు పోవడమో లేదా నిరసన తెలిపి వాక్ అవుట్ చేయడమో లేదా సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోవడమో మనం అందరం చూస్తూనే ఉన్నాము. 

సభలో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరగాలని వాటిలో ప్రతిపక్షాలు పాల్గొని చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వాలు చెపుతుంటాయి. కానీ వాటి సలహాలు, సూచనలు పట్టించుకోవు. వాటి అభ్యర్ధనలకు సానుకూలంగా స్పందించవు. వారి వలన తమకి ఇబ్బంది కలుగుతుందని భావిస్తే నిర్మొహమాటంగా సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేస్తుంటాయి. అధికార, ప్రతిపక్షాలు రెండూ తమ ఈ వైఖరిని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడవు. ఇదీ మన చట్ట సభలు జరుగుతున్న తీరు. 

అయితే శాసనసభ సమావేశాలు జరుగనప్పుడు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వ తీరుని విమర్శించే ప్రతిపక్షాలు పార్లమెంటు, శాసనసభ సమావేశాలు నిర్వహించినట్లయితే ప్రభుత్వం దుమ్ము దులిపేస్తామని ప్రగల్బాలు పలుకుతుంటాయి. కానీ సమావేశాలు మొదలైతే వాటి నుంచి ఏవిధంగా బయటపడాలా..ఆని ఆలోచిస్తున్నట్లు వ్యవహరిస్తుంటాయి. ఈరోజు శాసనసభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు చూస్తే అటువంటి భావనే కలుగుతుంది. 

శాసనసభ సమావేశాలు జరుగనప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడం కష్టం కనుక ప్రతిపక్షాలను తప్పు పట్టలేము. కానీ శాసనసభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ కంటి ముందు ఎదురుగా నిలబడి ఉనప్పుడు నిలదీయకుండా ప్రతిపక్షాలు ఏదో వంక పెట్టుకొని సభని బహిష్కరించి వెళ్ళిపోతున్నారు. దానికి వారు ఎంత అందమైన ప్రజాస్వామ్య ముసుగు తొడిగినప్పటికీ వారు ప్రభుత్వానికి భయపడి సభ నుంచి పారిపోయినట్లేనని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. 

ఎవరి వాదనలు ఎలాగున్నప్పటికీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ్యులు అందరూ తప్పనిసరిగా వాటికి హాజరవడం వారి బాధ్యత. అందుకే తమని ప్రజలు ఎన్నుకొన్నారని గుర్తుంచుకోవాలి. ఒకవేళ శాసనసభ సమావేశాలకు వెళ్ళడం కష్టమని భావిస్తున్నట్లయితే అటువంటి వారు ఇక శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటేనే మంచిది. శాసనసభలో తమ సమస్యలని ప్రస్తావించి వాటి పరిష్కరించేవారినే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకొని శాసనసభకి పంపించుకొంటారు కదా!


Related Post