కోదండరామ్ కి తెరాస సర్కార్ షాక్!

December 29, 2016


img

తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్కి తెరాస సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. శాసనసభలో అది ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుని వ్యతిరేకిస్తూ కోదండరామ్ నేతృత్వంలో జేయేసి సభ్యులు గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలనుకొన్నారు. దానికి అనుమతి కోరుతూ ఆయన వారం రోజుల క్రితమే దరఖాస్తు చేసుకొన్నారు. అనుమతి లభిస్తుందనే ఉద్దేశ్యంతో ధర్నాకి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. కానీ ఆఖరు నిమిషంలో దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన వారిని పోలీసులు నిర్బందించారు. తాము శాంతియుతంగా ధర్నా చేసుకోవాలనుకొంటే సుమారు 1,000 మందికి పైగా తమ అనుచరులని పోలీసులు నిర్బంధించారని ఇదెక్కడి న్యాయం అని ప్రొఫెసర్  కోదండరామ్ ప్రశ్నించారు. 

తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసేదిగా ఉందని అన్నారు. రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి తెరాస సర్కార్ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. తెరాస సర్కార్ రైతులకు నష్టం కలిగిస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని ప్రొఫెసర్  కోదండరామ్ హెచ్చరించారు. పోలీసులు అనుమతి ఈయనందున ఈరోజు జరుగవలసిన ధర్నా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు అత్యవసరంగా జేయేసి సమావేశం అయ్యి ఈ పరిణామాలపై చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందించుకొంటుందని ప్రొఫెసర్  కోదండరామ్ ప్రకటించారు. 

తాము ప్రవేశ పెట్టిన భూసేకరణ బిల్లు వలన 2013 భూసేకరణ చట్టం కంటే రైతులకు 10 రెట్లు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో చెప్పారు. కానీ దాని వలన రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ప్రొఫెసర్  కోదండరామ్ వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కనుక అందరూ కూర్చొని దానిలో మంచి చెడులను చర్చించి, లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. కానీ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు అద్భుతమైనదని ముఖ్యమంత్రి, కాదని ప్రతిపక్షాలు, ప్రొఫెసర్  కోదండరామ్ వాదోపవాదాలు చేసుకోవడం వలన సమస్య పరిష్కారం కాదు.

అయినా ఒకప్పుడు తెలంగాణా సాధన కోసం ధర్నాలు, నిరసన దీక్షలు చేయడం తమ హక్కు అని వాదించిన తెరాస నేతలు ఇప్పుడు తెలంగాణా రైతుల కోసం ప్రొఫెసర్  కోదండరామ్ ధర్నా చేయాలనుకొంటే అడ్డుకోవడం న్యాయమా? తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూసేకరణ బిల్లు వలన రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని గట్టిగా నమ్ముతున్నప్పుడు  ప్రొఫెసర్  కోదండరామ్ వంటివారిని అడ్డుకోవడం ఎందుకు? రైతులు తమకి ప్రభుత్వం వలననే ఎక్కువ లాభం కలుగుతుంది.. ప్రొఫెసర్  కోదండరామ్ వలనే ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినట్లయితే వారే ఆయనను తిరస్కరిస్తారు కదా? కనుక రైతులు, ప్రజల తరపున మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభుత్వం  ఆయనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post