అది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

December 27, 2016


img

ఈసారి శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు పదేపదే అధికార పార్టీకి దొరికిపోయి చిత్తయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా ధాటిగా మాట్లాడే ఎమ్మెల్యే కోమటిరెడ్డి కూడా ఈసారి కేసీఆర్ కి దొరికిపోవడం విశేషం. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ వారికి ఇళ్ళయితే కట్టించలేదు కానీ తన కోసం 150 గదులున్న ఇంద్రభవనం వంటి పెద్ద బంగ్లా కట్టించుకొన్నారని ఎద్దేవా చేసినప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. “ప్రగతి భవన్ అనేది నా కోసం కట్టుకొన్న స్వంత ఇల్లు కాదు. ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే వారు అందులో ఉండేందుకు కట్టించినది. అది తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలనే ఆవిధంగా కట్టించాను. 

అసలు ఇదివరకే ముఖ్యమంత్రి కోసం అటువంటి అధికారిక నివాస భవనం కట్టించి ఉండాలి కానీ ఎందుకో ఎవరూ ఆ విషయం పట్టించుకోలేదు. ఆ పని నేను పూర్తి చేశాను. అది అధికారిక నివాసమే తప్ప స్వంత నివ్సం కాదని కోమటి రెడ్డి గ్రహిస్తే మంచిది.     నా తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే వారు అందులో ఉంటారు. ప్రగతి భవన్ లో మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించుకోవడానికి అత్యాధునికమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మంచి పార్కింగ్ సౌకర్యం ఉంది. కానీ దానిలో మీరు చెపుతున్నట్లుగా 150 గదులు మాత్రం లేవు. అసలు ఎక్కడైనా ముఖ్యమంత్రి నివాసంలో అన్ని గదులు ఉంటాయా? పత్రికలలో వచ్చిన వార్తలను పట్టుకొని శాసనసభలో ప్రశ్నించడమేనా? ” అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన దానికి కోమటిరెడ్డి వద్ద సమాధానం లేదు.

తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై కాంగ్రెస్ నేతలు డికె అరుణ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు కూడా ముఖ్యమంత్రి దీటుగా జవాబు చెప్పారు. “డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామనే మా హామీపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కొంచెం ఆలస్యం అయినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళే కట్టిస్తాము తప్ప డబ్బా ఇళ్ళు కట్టించము. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో వాటి నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయి. వాటి గురించి నేను ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినప్పుడు ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి, కేంద్రప్రభుత్వం తరపున యధాశాక్తిన వాటికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. 

గతంలో కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇళ్ళు అర్హుల కంటే అనర్హులకే ఎక్కువగా అందాయి. మా లెక్కల ప్రకారం ఒక లక్షా ఐదు వేలమంది అనర్హులు ఆ ఇళ్ళని చేజిక్కించుకొన్నారని తేలింది. గతంలో హౌసింగ్ బోర్డ్ అంటే అవినీతికి కేరాఫ్ అడ్డ్రస్ గా ఉండేది. కానీ ఇప్పుడు మేము కడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసాకి లెక్కలున్నాయి. అర్హులకే అ ఇళ్ళు అందజేస్తున్నాము. మొత్తం ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోంది. ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం కాదు. దేని గురించి మాట్లాడాలన్నా ముందు దాని గురించి పూర్తి విషయసేకరణ, అద్యయనం చేసి మాట్లాడితే అందరికీ బాగుంటుంది,” అని అన్నారు.  


Related Post