శశికళ పరిస్థితి తారుమారు?

December 27, 2016


img

జయలలిత మరణించిన తరువాత ఆమె స్నేహితురాలు శశికళ అధికార అన్నాడిఎంకె పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. మొదట పార్టీ పగ్గాలు మాత్రమే చేపట్టాలనుకొన్న ఆమె తరువాత ముఖ్యమంత్రి పీఠంపై కూడా కన్ను వేసి దాని కోసం వేగంగా పావులు కదిపారు. ఆమె ప్రయత్నాలు ఫలించి ప్రభుత్వంలో అనేకమంది మంత్రులు, శాసనసభ్యులు ఆమెనే రెండు పదవులు చేపట్టామని అభ్యర్ధించారు. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కంగు తిన్నారు. కానీ ఆయన కూడా వేగంగా పావులు కదిపి పరిస్థితులు చెయ్యి దాటిపోకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఆయన గుర్తించలేని రెండు ముఖ్యమైన విషయాలను ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ గుర్తించి హెచ్చరించడమే విశేషం. 

తమిళనాడులో 12 విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సిలర్స్ ప్రదర్శించిన అత్యుత్సాహమే శశికళ కొంప ముంచింది. వారు ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయం అని భావించారో ఏమో ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు హడావుడిగా ఆమె ఉంటున్న పోయెస్ గార్డెన్స్ కి వచ్చి కలిశారు. ఆమెతో ఫోటోలు తీయించుకొన్నారు. ప్రస్తుతం ఆమె ఏ పదవిలోనూ లేదు. అన్నాడిఎంకె పార్టీ లో ఒక సాధారణ కార్యకర్త మాత్రమే. అటువంటి వ్యక్తిని వైస్-ఛాన్సిలర్స్ ఎందుకు కలిశారు? వారికి ఈ రాజకీయాలతో పనేమిటి? ఆవిధంగా వారు ఆమెను కలవడం తప్పు కనుక వారిపై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ స్టాలిన్ గవర్నర్ కి ఒక లేఖ వ్రాశారు. అలాగే పోయెస్ గార్డెన్ లో శశికళకు అంత బారీ భద్రత ఎందుకు కల్పించారు? ఆమెకి ఏ హోదాలో అంత భద్రత పొందుతున్నారు? అని ప్రశ్నించారు. 

స్టాలిన్ సందించిన ఈ రెండు లేఖాస్త్రాలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన లేఖపై స్పందించిన గవర్నర్ శశికళను కలిసిన వైస్ చాన్సిలర్లకు సంజాయిషీలు కోరుతూ నోటీసులు పంపించడానికి సిద్దం అవుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆమె ఇంటివద్ద ఉన్న బారీ పోలీస్ మోహరింపుని తొలగించి, నామమాత్రంగా ఒక నలుగురిని మాత్రం ఉంచింది. అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్న శశికళ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ వర్ధంతి సందర్భంగా ఈనెల 24న మెరీనా బీచ్ లో జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదు. పార్టీ వ్యవస్తాపకుడిని గౌరవించలేని శశికళకి పార్టీ పగ్గాలు అప్పజెప్పకూడదనే వాదన మొదలైంది. ఈ సంఘటనలతో పార్టీలో క్రమంగా ఆమెకి వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయాచితంగా పార్టీ అధ్యక్ష పదవిని అందిస్తే దురాశకు పోయినందుకు శశికళకు మొదటికే మోసం వచ్చేలా ఉంది.  


Related Post