క్యాష్ లెస్ అంటే లెస్ క్యాష్ అట!

December 26, 2016


img

నోట్ల రద్దు తరువాత దేశంలో నగదు కొరత ఏర్పడటంతో ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ నగదు రహిత లావాదేవీలకి మారిపోవడమే మన తక్షణ కర్తవ్యం అన్నట్లు కోరస్ పాడటం మొదలుపెట్టారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యధాశాక్తిన వంతపాడటం మొదలుపెట్టాయి. అది చూసి చాల మంది ప్రజలతో సహా, ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేశాయి. దేశంలో సగం మంది నిరుపేదలు, నిరక్షరాస్యులు, కనీసం ఒక్కపూట తినడానికి తిండేలేని వారిని నగదు రహిత లావాదేవీలు చేయమని ఒత్తిడి చేయడం ఏమిటి? అంటూ గట్టిగా నిలదీశాయి. అప్పుడు కేంద్రప్రభుత్వం గణాంకాలు లెక్కలు తీసి చూసుకొంటే ప్రతిపక్షాలు చెపుతున్నది నిజమేనని అర్ధమవడంతో పల్లవి మార్చి ఇప్పుడు సరికొత్త రాగం తీస్తోంది. క్యాష్ లేస్ అంటే అసలు క్యాష్ లేకుండా లావాదేవీలు నిర్వహించాలని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని, లెస్ క్యాష్ అంటే అతి తక్కువ క్యాష్ తో లావాదేవీలు నిర్వహించాలన్నదే తమ అభిమతం అని కోరస్ పాడటం మొదలుపెట్టారు.

ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాగం అందుకోగానే కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు కోరస్ పాడటం మొదలుపెట్టారు. మోడీ సై అంటే సై అనే వెంకయ్య నాయుడు మరొక అడుగు ముందుకు వేసి మోడీ చెప్పిన పదాలన్నీ మళ్ళీ నిన్న విజయవాడలో కూడా గడగడా వల్లించేశారు. డిశంబర్ 30వ తేదీతో సామాన్య ప్రజలు కష్టాలన్నీ తొలగిపోతాయని, నల్లకుభేరులు కష్టాలు మొదలవుతాయని ఖరారు చేసేశారు. వాళ్ళదగ్గర ఉన్న నల్లధనం అంతా బ్యాంకులకి చేరలేదని స్పష్టం చేశారు. అంటే ఇంకా చాలా నల్లధనం దేశంలో ఉందని ఆయన దృవీకరిస్తున్నారన్న మాట! అయితే డిశంబర్ 30 తరువాత ఇక ఆ నోట్లు చిత్తు కాగితాలతో సమానం అవుతాయి కనుక ఆ మేరకు దేశ ఆర్ధిక వ్యవస్థలో నగదు నష్టపోతుందని స్పష్టం అవుతోంది.

ఇక అంబానీ, ఆదానీల వద్ద ఉన్న నల్లధనం గురించి వెంకయ్య నాయుడు నోట మాట వినపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వారికి గత యూపీయే ప్రభుత్వ హయాంలోనే రూ. 1. 80,000 కోట్లు బ్యాంకులు అప్పుగా ఇచ్చాయని చెప్పారు. మరి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్ళు పూర్తయినా వారి వద్ద నుంచి ఆ డబ్బుని ఇంతవరకు ఎందుకు వసూలు చేయలేకపోయింది? ఇంకా ఆవిధంగా ఎంత మంది ఎన్ని లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది? వాటిని కేంద్రప్రభుత్వం ఎప్పుడు వసూలు చేస్తుందో వెంకయ్య నాయుడు చెప్పగలిగితే ప్రజలు కూడా కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధిని శంఖించరు కదా! ఏమైనప్పటికీ మోడీ ప్రభుత్వం క్యాష్ లెస్ అనే ఇంగ్లీష్ పదానికి లెస్ క్యాస్ అనే కొత్త బాష్యం చెప్పడం అదుర్స్!


Related Post