తెదేపా అక్కడ అలా..ఇక్కడ ఇలాగ!

December 24, 2016


img

ఇటీవల రాష్ట్ర శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్, తెదేపాల నుంచి తెరాసలోకి పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, తెదేపా శాసనసభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. వారు సంతలో పశువులు అమ్ముడుపోయినట్లు తెరాస సర్కార్ కి అమ్ముడుపోయారని ఆరోపించారు. ఇక్కడ శాసనసభలో రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిన రెండు రోజులకే ఆంధ్రాలో వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. ఇక్కడ తెరాసలో చేరడానికి తెదేపా, కాంగ్రెస్ శాసనసభ్యులు ఏమని చెప్పారో అక్కడ ఆమె కూడా అదే కారణం చెప్పారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి ఏమని ఆరోపిస్తున్నారో అక్కడ వైకాపా నేతలు అదే ఆరోపిస్తున్నారు. 

పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం, ఆవిధంగా ప్రతిపక్షాలను బలహీనపరిచి అధికార పార్టీలు తమకు ఎదురులేకుండా చేసుకోవాలనుకోవడం ఎక్కడ జరిగినా అతువన్తీ ఆలోచనలు, ప్రయత్నాలు అనైతికమే..ప్రజాస్వామ్య విధానాలకి విరుద్దమే. కానీ ఇప్పుడు అధికార పార్టీలకి అటువంటి పట్టింపులు ఏవీ లేనందున ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నాయి. అప్పుడు ప్రతిపక్షాలు ఒక రాష్ట్రంలో ఒక విధంగా మరొక రాష్ట్రంలో మరొకవిధంగా వ్యవహరిస్తుండటం కూడా అంతే తప్పు. రాజకీయ పార్టీలు నైతిక విలువలను పక్కన పెట్టి ఒక్కో మెట్టు దిగితే చివరికి మళ్ళీ అవే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మరిచిపోకూడదు.  


Related Post