నోట్ల రద్దు మంచైనా చెడైనా మోడీదే క్రెడిట్

December 24, 2016


img

సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పుడు, మళ్ళీ నోట్ల రద్దు ప్రకటించినప్పుడు వచ్చే ఏడాది జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అవి చేసి ఉండవచ్చని కొందరు ఊహిస్తే, ‘అవును వాటి కోసమే మోడీ అటువంటి నిర్ణయాలు తీసుకొన్నారని’ ప్రతిపక్షాలు వంతపాడాయి. కానీ నోట్ల రద్దు తదనంతర పరిణామాల కారణంగా దేశ ప్రజలలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం పట్ల వ్యతిరేకత ఎదురైనప్పుడు, ప్రతిపక్షాలు దానిని తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేశాయి. 

మొదట ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోడీ ఆ నిర్ణయం తీసుకొన్నారని వాదించిన పార్టీలే మాట మార్చి ఆయన అనాలోచిత నిర్ణయం వలన ప్రజలు కష్టాలు పడుతున్నారు కనుక వచ్చే ఏడాది జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రజలు మోడీని తిరస్కరించబోతున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. అంటే మొదట దాని వలన భాజపా ఎక్కడ లాభపడుతుందోనని భయపడిన ప్రతిపక్షాలు, ప్రజలలో వ్యతిరేకత కనిపించేసరికి దాని వలన తమకి లాభం కలుగుతుందని సంబరపడుతున్నట్లు అర్ధం అవుతోంది. 

కానీ మోడీ ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొని ఉండే ఉంటే, ఈ నిర్ణయం మరో రకంగా ఉండి ఉండేది. అప్పుడు దాని ఫలితాలు కూడా వేరే విధంగా ఉండేవి. కానీ ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నారు కనుక దాని ఫలితాలు కూడా సానుకూలంగానే ఉండవచ్చు. ఒకవేళ వాటి వలన భాజపా అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లయితే ప్రతిపక్షాలు మళ్ళీ పాత పాటే పడటం మొదలుపెట్టవచ్చు. అంటే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకోవడం అనుకోవచ్చు. 

ఏమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ తన పార్టీ భవిష్యత్ ని, తన ప్రతిష్టని పణంగా పెట్టి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు. అనేక దశాబ్దాల పాటు దేశాన్నిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను మోడీ చేసి చూపిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించడానికి కూడా భయపడే రాహుల్ గాంధీ, మోడీ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పు పట్టడం చాల హాస్యాస్పదంగా ఉంది. ఈ నిర్ణయం వలన తలెత్తే సమస్యలకు తనే పూర్తి బాధ్యత వహిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ మొదటే చెప్పారు. కనుక ఆ క్రెడిట్ కూడా ఆయనకే చెందుతుంది. 

ఏమి చేస్తే ఏమవుతుందో అనే భయంతో ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటి ఫలితాలను ఆశించడం మేలు. ప్రస్తుతం మోడీ అదే చేస్తున్నారు. కనుక వాటిలో కొన్ని తప్పులు జరిగినా ప్రజలు ఆయనకు బాసటగా నిలవడం ఖాయం.    



Related Post