నోట్ల రద్దుపై విదేశీ పత్రికలు విమర్శలు

December 24, 2016


img

పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దేశంలోనే కాక విదేశాలలో కూడా భినాభిప్రయలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ పత్రికలూ ఫోర్బ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. సుమారు 92 శాతం నగదు లావాదేవీలే జరిగే భారత్ వంటి దేశంలో రాత్రికి రాత్రి ఆ నగదును చెల్లకుండా చేయడం చాలా ఘోర తప్పిదమని, అది ప్రభుత్వమే ప్రజల సొమ్మును దోచుకోవడమేనని ఫోర్బ్స్ పత్రిక విమర్శలు గుప్పిస్తే, చాలా బారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగే భారత్ లో ఒకేసారి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలనుకోవడం ఎఫ్-1 రేసులో ఎడ్లబండిని పెట్టి వేగంగా పరిగెత్తమని ఎడ్లను కొడుతున్నట్లుందని వాల్ స్ట్రీట్ జర్నల్ విమర్శించింది. దేశంలో అవినీతిని, లంచగొండి తనాన్ని నిరోదించే ప్రయత్నాలు చేయకుండా నోట్ల రద్దుతో సామాన్య ప్రజలను ప్రభుత్వం చాలా కష్టాల పాలు చేసిందని, ఆ నిర్ణయం చాలా తప్పని అభిప్రాయం వ్యక్తం చేశాయి. 

నోట్ల రద్దుపై దేశంలో ప్రతిపక్షాలు, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ వంటి అనేకమంది ఆర్ధిక నిపుణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వలన దేశంలో సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్న మాట వాస్తవం. అనేక లక్షల మంది చిన్న చిన్న వ్యాపారులు నష్టపోతున్న మాట కూడా వాస్తవమే. అలాగే నగదు రహిత లావాదేవీలకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా తొందరపడుతున్న మాట కూడా వాస్తవమే. అయితే ఈ నిర్ణయం వలననే దేశంలో ఎంత నల్లధనం ఉందో మొట్ట మొదటిసారిగా సామాన్య ప్రజలు కూడా తమ కళ్ళతోనే చూడగలుగుతున్నారు. 

ఇక నగదు రహిత లావాదేవీల విషయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. మన దేశం ఆర్ధిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రాత్రికి రాత్రే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలనుకోవడం అవివేకమే. అటువంటి బృహుత్ ప్రయత్నాలు చేయాలంటే ఒక నిర్దిష్ట ప్రణాళిక, సమయం పెట్టుకొని క్రమంగా అమలుచేయడం మంచిది. లేకుంటే ఇది కూడా మరో సంక్షోభానికి దారి తీయవచ్చు. 

అయితే నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు వంటి నిర్ణయాలు దేశానికి మేలు చేసేవే తప్ప విదేశీ పత్రికలూ చెపుతున్నట్లు కీడు చేసేవి కావు. వాటి వలన దేశంలో తాత్కాలికంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ, దేశ ప్రజలు నానా కష్టనష్టాలను భరించవలసి వస్తున్నప్పటికీ, దీర్గ కాలంలో దాని వలన దేశానికి, ప్రజలకి మేలు కలిగే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులే చెపుతున్నారు. 

భారత్ వంటి దేశం ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అగ్రరాజ్యాలు జీర్ణించుకోవడం కష్టమే. ఆ విధంగా వాదిస్తున్న వారందరూ తమ మేధాశక్తిని ప్రదర్శిస్తూ నాణేనికి ఒక వైపును మాత్రమే చూపిస్తూ    ప్రజలను ఇంకా అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పక తప్పదు. కష్టమైనా, నష్టమైన అనేక దశాబ్దాల తరువాత భారత్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేస్తున్నప్పుడు ఇటువంటి విమర్శలను చూసి వెనుకంజ వేయనవసరం లేదు. ఆత్మన్యూనతతో బాధపడనవసరం లేదు.  


Related Post