సంచలన సంవత్సరం: 2016

December 23, 2016


img

మరొక వారం రోజులలో 2016 ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సందర్భంగా ఈ ఏడాది మన దేశానికి, రాష్ట్రానికి ఏవిధంగా గడిచింది అని ఒకసారి వెనుదిరిగి చూసుకొన్నట్లయితే మొదటి నుంచి చివరి రోజు వరకు అన్నీ సంచలనమైన పరిణామాలు, సంఘటనలే కనిపిస్తాయి.

జనవరి 2: పాక్ ఉగ్రవాదులు పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడులు చేసి, భారత సార్వభౌమత్వానికి పెను సవాలు విసిరారు. అయితే అదృష్టం కొద్దీ వారు లోపాలకి జొరబడకుండా మన భద్రతాదళాలు అడ్డుకోగలిగాయి. ఆ ప్రయత్నంలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ తో సహా ఏడురుగు సైనికులు చనిపోయారు. అప్పటి నుంచే భారత్-పాక్ సంబంధాలు వేగంగా క్షీణించడం మొదలయ్యాయి.

జనవరి 3: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దానిలో 9మంది పౌరులు మరణించగా, సుమారు 100 మంది గాయపడ్డారు. 

జనవరి 7: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించారు. ఆయన స్థానంలో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా భాజపా మద్దతు పలికినప్పటికీ ఆమె చాలా విచిత్రంగా వ్యవహరిస్తూ నాలుగు నెలలు భాజపాతో గొడవ పడ్డారు. కానీ అదే మళ్ళీ భాజపా మద్దతుతో ఏప్రిల్ 4న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఫిబ్రవరి 29: ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సం.లకి రూ.19,78,060 కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత ఆర్ధిక సంవత్సరం కంటే ఇది 10.8 శాతం ఎక్కువ. 

ఏప్రిల్ 4- మే 16: కేరళ, తమిళనాడు, పాండిచేరి, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలో అన్నాడిఎంకె పార్టీ వరుసగా రెండవసారి అధికారంలోకి రాగలిగింది. భాజపా చరిత్రలో మొదటిసారిగా ఈశ్యన్య రాష్ట్రమైన అసోంలో అధికారంలోకి రాగలిగింది. పశ్చిమ బెంగాల్ లలో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. 

మే 30:దేశంలో మొట్ట మొదటిసారిగా స్పెయిన్ దేశం నుంచి దిగుమతి చేసుకొన్న హై స్పీడ్ టాల్గో ట్రైన్ న్ని యూపిలో బరేలీ నుంచి మొరదాబాద్ వరకు నడిపి పరీక్షించారు. అది గంటకు 115 కిమీ వేగంతో పయనిస్తుంది. ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది.

జూలై 8: కాశ్మీర్ వేర్పాటువాది హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. అప్పటి నుంచి సుమారు మూడు నెలలు పైగా కాశ్మీర్ లో తీవ్రంగా అల్లర్లు జరిగాయి. వాటిలో సుమారు 100మందికి పైగా మరణించారు. 2000 మందికిపైగా గాయపడ్డారు. 

జూలై 22: భారత్ వాయుసేనకు చెందిన ఎఎన్-32రవాణా విమానం తమిళనాడులో తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన కొద్ది సేపటికే అదృశ్యమయింది. దానిలో 29మంది ఉన్నారు. దాని కోసం ఎంతగా గాలించినప్పటికీ దాని ఆచూకి దొరకలేదు. అందులో ఉన్నవారందరూ మరణించినట్లు భావించబడ్డారు.

ఆగస్ట్ 5-21 రియో ఒలింపిక్స్ భారత్ క్రీడాకారులు పివి సింధు (సిల్వర్), సాక్షి మాలిక్ (రజతం) గెలుచుకొచ్చారు. 

సెప్టెంబర్ 18: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో యూరిలో గల ఆర్మీ క్యాంప్ పాక్ ఉగ్రవాదులు దొంగచాటుగా దాడి చేశారు. ఆ దాడిలో 17మంది సైనికులు చనిపోయారు. 

సెప్టెంబర్ 22: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చబడ్డారు. అప్పటి నుంచి ఆమె డిశంబర్ 5న గుండెపోటుతో చనిపోయే వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు.  

సెప్టెంబర్ 29: భారత ఆర్మీ బృందం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి అక్కడ మాటు వేసి ఉన్న సుమారు 38 మంది తీవ్రవాదులను, వారి 7 శిబిరాలను ద్వంసం చేసి వచ్చారు. దీనితో యావత్ ప్రపంచ దేశాలలో భారత్ పేరు మారుమ్రోగిపోయింది. అయితే అప్పటి నుంచి చాలా రోజుల వరకు సరిహద్దుల వద్ద పాక్ సైనికులు భారత్ సైనికులపై, సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. అలాగే పాక్ ఉగ్రవాదులు తరచూ మన సైనికులపై గెరిల్లా పద్దతిలో దాడులు చేసి పొట్టన పెట్టుకొంటూనే ఉన్నారు. 

నవంబర్ 8: భారతదేశంలో ప్రజలు అందరూ ఉలిక్కి పడిన రోజు ఇది. ప్రధాని నరేంద్ర మోడీ పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తునట్లు ప్రకటించారు. అప్పటి నుంచి దేశంలో జరుగుతున్నవిపరీతాలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

నవంబర్ 16: పార్లమెంటు శీతాకాల సమావేశాలలో నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు రభస. డిశంబర్ 22న సమావేశాలు ముగిసేవరకు కూడా సభ సజావుగా సాగలేదు. మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నవంబర్ 20: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచిబిహార్ రాజధాని పాట్నా వెళుతున్న ఇండోర్-రాజేందర్ నగర్ ఎక్స్ ప్రెస్ (నెంబర్: 19321) కాన్పూర్ సమీపంలో పుకర్యాన్ అనే ప్రాంతంలో పట్టాలు తప్పడంతో సుమారు 150మంది ప్రయాణికులు మరణించగా, మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఏడాది జరిగిన ఘోర రైలు ప్రమాదాలలో ఇదే అతిపెద్దది.  

నవంబర్ 22: ప్రముఖ వాగ్గేయకారుడు మంగళం పల్లి బాల మురళీకృష్ణ మృతి చెందారు.

డిశంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటు కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. అదే రోజు అర్దరాత్రి పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

డిశంబర్ 7: ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తుగ్లక్ పత్రిక సంపాదకుడు, జయలలిత సన్నిహితుడు చో రామస్వామి చెన్నై అపోలో ఆసుపత్రిలో వృద్దాప్య సమస్యల కారణంగా అనారోగ్యంతో మృతి చెందారు.

డిశంబర్ 30: దేశంలో పాత రూ.500, 1000 నోట్లని బ్యాంకులు స్వీకరించడానికి ఆఖరి రోజు. 31 నుంచి బ్యాంకులు కూడా ఆ నోట్లను స్వీకరించవు. 



Related Post