బ్యాంకులే డబ్బు దొంగిలిస్తుంటే..

December 23, 2016


img

 ఒకపక్క సామాన్య ప్రజలు, వృద్ధులు కళ్ళు కాయలు కాసేలాగ, కాళ్ళు పడిపోయేలాగ బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి నానా కష్టాలు పడుతుంటే, దేశ వ్యాప్తంగా రోజూ లక్షలు, కోట్లు విలువగల కొత్త నోట్లు నల్లకుభేరుల వద్ద నుంచి పట్టుబడుతున్నాయి. మొదట్లో పాతనోట్లు పట్టుబడేవి…ఇప్పుడన్నీ కొత్త నోట్లే! 

అంత బారీగా వారికి కొత్త నోట్లు ఎలాగ లభిస్తున్నాయి? అనే విషయం ఇప్పుడు పిల్లలకి కూడా తెలిసిపోయింది. ఇటీవల చెన్నైలో పట్టుబడిన శేఖర్ రెడ్డి హైదరాబాద్, విశాఖపట్నంలో గల జాతీయ బ్యాంకుల నుంచే రూ.127 కోట్లు విలువ గల కొత్త నోట్లు పట్టుకుపోయాడు. అంతకు ముందు డిల్లీలో యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులే నకిలీ ఖాతాలు తెరిచి సుమారు రూ.100 కోట్లు నల్లధనం కొత్త నోట్లతో మార్చేశారు. ఆ విషయం బయటకి పొక్కిన తరువాత కూడా మళ్ళీ అదే బ్యాంక్ కి చెందిన వేరే బ్రాంచిలో కూడా అదే కధ పునరావృతమవడం విశేషం. 

మళ్ళీ నిన్న డిల్లీలోనే కస్తూర్భా గాంధీ మార్గ్ లో గల కోటక్ మహీంద్ర బ్యాంక్ లో అదే కధ రిపీట్ అవడం చూస్తే అడ్డుదారిలో సులువుగా డబ్బు సంపాదించుకొనేందుకు బ్యాంక్ సిబ్బంది కూడా ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్దం అయినట్లు కనిపిస్తోంది. 

ఆ బ్యాంక్ లో రమేష్ చంద్, రాజ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు 9 నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా రూ.70 కోట్లు నల్లధనాన్ని కొత్తనోట్లలోకి మార్చేశారు. ఆ విషయం కనిపెట్టి ఆదాయపన్ను శాఖా అధికారులు దాడులు చేయగా రూ.39 కోట్లు మాత్రం పట్టుబడింది. అయితే వారి దగ్గర నుంచి అన్ని దృవపత్రాలు, ఆధారాలు తీసుకొన్న తరువాతనే ఖాతాలు తెరిచేందుకు అనుమతించామని బ్యాంక్ అధికారులు వాదిస్తున్నారు. 

వారి వాదన బాగానే ఉంది. అయితే రోజుకి కేవలం రూ.4,000 కంటే ఎక్కువ తీసుకొనేందుకు వీలులేనప్పుడు, ఈ నెలరోజుల్లోనే ఆ 9 ఖాతాలలో ఏకంగా రూ.70 కోట్లు ఏవిధంగా మార్చుకోగలిగారు? అనే ప్రశ్నకు బహుశః బ్యాంక్ యాజమాన్యం వద్ద కూడా సమాధానం ఉండకపోవచ్చు. 

ఈవిధంగా బ్యాంకులే ప్రజలను, ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. దొరికితేనే దొంగలు..దొరకనివారు అందరూ దొరలే అన్నట్లుగా దేశంలో ఇంకా ఎన్ని బ్యాంకులు, వాటిలో సిబ్బంది ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. వారు ఎన్ని వేల కోట్లు నల్లధనాన్ని కొత్తనోట్లుగా మార్చేశారో ఊహించలేము కూడా. 

దొంగలు బ్యాంకులని దోచుకోవడం చూసి ఉంటాము కానీ బ్యాంకులు, వాటి సిబ్బందే తమ బ్యాంకులను, ప్రజలని, ప్రభుత్వాన్ని దోచుకోవడం ఎన్నడూ చూసి ఉండము. కేవలం సినిమాలలో మాత్రమే చూడగలిగే ఇటువంటి బారీ దోపిడీలు పట్టపగలు, యదేచ్చగా జరగడం చూస్తుంటే నోట్ల రద్దు చేసి మోడీ అనుకొన్న ప్రయోజనం సాధించారా లేకపోతే నల్లధనం రూపురేఖలు మార్చి, నల్లకుభేరులు జాబితాను ఇంకా పెంచారా? అనే అనుమానం కలుగుతోంది. 

మోడీ పెట్టిన గడువు ముగియడానికి ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. కానీ ఈ బ్యాంక్ దోపిడీల కారణంగా ఇంతవరకు సామాన్య ప్రజలకు తమ ఖాతాలలో నుంచి రూ.2,000 తీసుకోవడానికి అవకాశం చిక్కడం లేదు. పెన్షన్ మీదే ఆధారపడి బ్రతుకుతున్న వృద్ధులు, వికలాంగులకి ఆ రూ.1000-1500 కూడా చేతికి అందడం లేదు. మరి వారి కష్టాలు ఇంకా ఎప్పటికి తీరుతాయో మోడీయే చెప్పాలి.


Related Post