కేటిఆర్ ఆలోచన మంచిదే కానీ..

December 23, 2016


img

సిరిసిల్ల పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది అక్కడి చేనేత కార్మికుల కష్టాలే..ఆ తరువాత ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటిఆర్! కేటిఆర్ వంటి శక్తివంతమైన, ‘పనిచేసే గుణం’ ఉన్న యువనేత తమ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే ఆయన తమ జీవితాలలో తప్పకుండా వెలుగులు నింపుతారని చేనేత కార్మికులు వారి కుటుంబాలు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ విషయం కేటిఆర్ కి కూడా బాగానే తెలుసు.

కేటీఆర్ తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్రాసిన లేఖలలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. 

"ఆరు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసిన కోట్లాది ఆశలు, లెక్కలేనన్ని కోరికలను గమ్యానికి చేర్చడానికి ప్రతీక్షణం తపిస్తున్న మీ అందరికి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. బట్ట కట్టినంకనే నాగరికత నడక నేర్చిందంటారు. లోకం ఆకలి తీర్చడానికి పొలంలో అన్నదాత హలం పడితే, మానం కాపాడడానికి నేతన్న మగ్గం పట్టాడు. భారతీయ సంప్రదాయ ఔన్నత్యాన్ని, చేనేతలోని హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్న ఎందరో నేతన్నలు తెలంగాణ గడ్డపై ఉన్నారు. పోచంపల్లి వస్త్రాల ప్రాభవం, నారాయణ పేట వస్త్రాల నాజూకుతనం, గద్వాల వస్త్రాల ఘనతను దేశవిదేశాలు కీర్తిస్తున్నాయి. సడుగులిరిగిన నేతన్న మగ్గానికి పూర్వ వైభవం తేవడానికి తెలంగాణ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తోంది. మగ్గం ఆడితేనే కాని డొక్కాడని చేనేత శ్రామికులకు చేయూతనిచ్చేందుకు వారంలో ఒక రోజు తప్పనిసరిగా మీరంతా చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతున్నాను. మీరే కాదు మీ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది అంతా చేనేత దుస్తులే ధరించేలా చూడాలని ప్రార్థిస్తున్నాను. టెస్కో సంస్థ అమలు చేస్తున్న “చేనేత లక్ష్మి పథకం”లో చేరి చేనేత వస్త్రములను కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించుటకు మీవంతు సహాయం చేయవలసినదిగా కోరుచున్నాను. ఒకప్పుడు చేనేత పరిశ్రమ ఉండేదని రాబోయే తరాలు చెప్పుకోవద్దంటే ఈ చిన్న ప్రయత్నాన్ని మనమంతా విజయవంతం చేద్దాం. బంగారు తెలంగాణలో చేనేత కార్మికులను కూడా భాగం చేసుకుందాం,” అని లేఖల ద్వారా అందరికీ విజ్ఞప్తి చేశారు. 

అయితే ఒక వందో రెండు వందల మంది ప్రజా ప్రతినిధులు చేనేత దుస్తులు ధరించినంత మాత్రాన్న చేనేత కార్మికుల జీవితాలలో ఎటువంటి మార్పు రాదని చెప్పక తప్పదు. వారి కష్టాలు తీరాలంటే చేనేత కార్పోరేషన్ సమూలంగా ప్రక్షాళన చేసి దాని పనితీరుని మెరుగు పరచడం చాలా అవసరం. అలాగే ప్రభుత్వ పాఠాశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ హాస్టల్స్, వగైరా అన్నీ చోట్ల చేనేత వస్తాలనే పంపిణీ చేయాలి. పౌర సరఫరా డిపోల ద్వారా చేనేత వస్త్రాలను సామాన్య ప్రజలకు అందించడం మొదలుపెడితే వాటి వాడకం పెరుగుతుంది. రాష్ట్ర ప్రజలు అందరూ చేనేత వస్త్రాలు ధరించడం అలవాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించడం మంచిది. అందుకు విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది. 

ఒక్క చేనేత రంగమే కాదు...ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వమే ఆలోచించాలి..దాని ఆలోచనలనే అమలుచేయాలనే నిశ్చితాభిప్రాయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సలహాలు, సూచనలు తీసుకొన్నట్లయితే ఊహించలేని గొప్ప సూచనలు, సలహాలు పొందే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ప్రతీ పనికి మొబైల్ ఫోన్స్ లో ఒక ప్రత్యేక యాప్, ఒక ప్రత్యేక వెబ్ సైట్స్ వచ్చేశాయి కనుక ప్రభుత్వం కూడా ఒక్కో రంగంలో లోటుపాట్లని సవరించి, అభివృద్ధి సాధించడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్స్, వెబ్ సైట్స్ సృష్టించి ప్రజల సహకారం కోరితే చాలా మంచిది. ప్రజల సహకారం ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చు.

సిద్దిపేట నియోజకవర్గంలో ఇబ్రహీంపూర్ గ్రామం 100 శాతం నగదు రహిత లావాదేవీల విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తుండటమే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక చేనేత కార్మికులను ఆదుకోవడానికి, ఆ రంగం అభివృద్ధి కోసం కూడా తెరాస సర్కార్ ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ప్రవేశపెట్టి ప్రజలందరినీ అందులో పాలు పంచుకొనేలా చేస్తే ఊహించని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.


Related Post