ఆ రెండు గ్రామాలలో రేపు పండగే

December 22, 2016


img

బహుశః ఇటువంటి వార్తలు వింటే ఎవరికైనా చాలా సంతోషం, ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. ప్రభుత్వం అంటే ఇలాగ పనిచేయాలి అని అనుకోకుండా ఉండలేము.

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకొన్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని రేపే లబ్దిదారులకి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించబోతున్నారు. వాటి యజమానులు తమ బంధుమిత్ర కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఒకేసారి గృహా ప్రవేశం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇళ్ళు నిర్మించి ఇచ్చేసి చేతులు దులుపుకుపోకుండా వారు సంతోషంగా గృహావేశం చేసుకోవడానికి వీలుగా ఒక్కో ఇంటికి ఒక్కో బ్రహ్మడిని, అవసరమైన పూజా సామాగ్రిని కూడా అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అక్కడ నిర్మించిన ఫంక్షన్ హాలులో 600 మంది బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం లభ్దిదారులు అందరూ తమ తమ ఇళ్ళలో తమకు కేటాయించిన బ్రాహ్మణుల అద్వర్యంలో గృహాప్రవేశ పూజలు, అనతరం సత్యానారాయణ స్వామి పూజ వగైరా కార్యక్రమాలన్నీ చేసుకొంటారు.

ఇప్పటికే లబ్దిదారులకి ఇళ్ళ తాళాలు అందజేశారు. వవాళ్ళందరూ తమ తమ ఇళ్ళను కడుగుకొని మామిడి తోరణలు కట్టుకొని రేపు గృహా ప్రవేశం చేయడానికి చాలా హడావుడిగా ఉన్నారు. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయబడిన అనేక మంది అధికారులు వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే వారి బంధు మిత్రులు కూడా చేరుకోవడంతో రెండు గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. మామిడి తోరణాలు, కొత్తబట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల హడావుడితో రెండు గ్రామాలు కళకళలాడిపోతున్నాయి. వారి జీవితంలో ఏనాడూ ఊహించని గొప్ప అద్భుతం ఇది. ఆ రెండు గ్రామాల ప్రజల కళ్ళలో ఎన్నడూ చూడని ఆనందం తొణికిసలాడుతోంది.

ఇక ఇళ్ళ విషయంలో చెప్పుకోవలసిన విశేషాలు చాలానే ఉన్నాయి. 

1. ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాకుండా వారి జీవనభ్రుతి కోసం ప్రతీ కుటుంబానికి రెండు పాడి గేదెలు, పది దేశీయ కోళ్ళు (తొమ్మిది పెట్టలు, ఒక పుంజు) బొమ్మల రామారం మండలం జమాల్‌పూర్ నుంచి తెప్పించి ఇస్తున్నారు.  

2. ప్రతీ ఇంటికి 5 మొక్కలు (కరివేపాకు, అరటి, కొబ్బరి, జామ, మెల్లె మొక్కలు) అందిస్తున్నారు.  

3. ప్రతీ ఇంటికి వైఫై కనెక్షన్ ఇచ్చారు.

4. ప్రతీ ఇంటికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించి, మిషన్ భగీరథ పధకం క్రింద నల్లా కనెక్షన్ ఇచ్చారు. వాటి ద్వారా శుద్ధి చేయబడిన గోదావరి నీళ్ళు అందించబోతున్నారు.

5. ప్రతీ ఇంటిలో ఎల్.ఈ.డీ. దీపాలు ఏర్పాటు చేశారు. 

6. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు.

7. ఇళ్ళ మద్య సిసి రోడ్లు, వాటి పక్కనే పచ్చటి ఫలపుష్పల మొక్కలు నాటారు. 

8. అన్ని ఇళ్ళను కలుపుతూ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

రేపు అంటే శుక్రవారం ఎర్రవల్లి గ్రామంలో 330, 156 ఇళ్ళల్లో గృహా ప్రవేశ పూజలు నిర్వహిస్తారు. మిగిలిన ఇళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్నపనులు పూర్తికావలసి ఉన్నందున వాటిలో ఆ ఇళ్ళ యజమానులు ప్రత్యేక పూజలు నిర్వహించుకొంటారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రూ.5.4 లక్షలు వ్యయంతో నిర్మించారు. రేపు ఉదయం 7.53 గంటలకి కేసీఆర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అది ముగిసిన వెంటనే గృహస్తులు అందరూ తమ బందుమిత్రులతో కలిసి తమతమ ఇళ్ళలో గృహాప్రవేశ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొంటారు.

ప్రభుత్వానికి మానవత్వమనే గుణం కూడా ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను చూస్తే అర్ధం అవుతుంది. ప్రభుత్వం అంటే ఎలాగ ఉండాలో ఆ గ్రామ ప్రజలను అడిగితే చెపుతారు. అంతమంది ప్రజల కళ్ళలో కనిపిస్తున్న ఆనందం, సంతృప్తి, కృతజ్ఞత కేసీఆర్ కి దీవెనలుగా, శ్రీరామరక్షగా  నిలుస్తాయి. తెరాస సర్కార్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరూ ఆయనని ఆదర్శంగా తీసుకొని తమ తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకొంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా అనిపిస్తుంది. 


Related Post