పాక్ సైన్యంలాగ ప్రతిపక్షాలు!

December 22, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ వారణాసిలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, “నేను నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించేముందు ప్రతిపక్షాల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు. కానీ ప్రతిపక్షాలు నల్లకుభేరుల తరపున చాలా గట్టిగానే నాతో పోరాడాయి. అవి వ్యవహరించిన తీరు ఎలాగుంది అంటే, మన దేశంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు పాక్ సైనికులు వారికి  కవరింగ్ ఫైర్ ఇచ్చి కాపాడినట్లుంది. నోట్ల రద్దు చేసి నేను దేశంలో నల్లధనం వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుంటే మన దేశంలో ప్రతిపక్షాలు నల్లకుభేరులను కాపాడటానికి నాపై యుద్ధం ప్రకటించాయి. అవిప్పుడు ఎవరివైపు నిలబడ్డాయో దేశప్రజలు అందరూ తమ కళ్ళతోనే చూశారు. వారి పోరాటాలకి భయపడి నేను వెనక్కి తగ్గేది లేదు. మన దేశం ఈ మురికి నుంచి కడిగిన ముత్యంలా బయటపడాలి. అప్పటి వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది,” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 

నోట్ల రద్దు తదనంతరం దేశంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితుల గురించి మోడీ ప్రభుత్వం ముందుగా అంచనా వేయడంలో విఫలం అయ్యిందని స్పష్టం అయ్యింది. కనీసం ఆ తరువాత అయినా యుద్ద ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలం అయ్యిందని చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది సామాన్య ప్రజలు  రోజుల తరబడి బ్యాంకులు, ఎటిఎంల ముందు క్యూ లైన్లలో నిలబడవలసి రావడం, అయినా వారికి రూ.2,000 నగదు లభించకపోవడం, మరో పక్క కోట్లాది రూపాయలు విలువగల కొత్త నోట్లు నల్లకుభేరుల వద్దకు చేరిపోతుండటం వంటివన్నీ ఆ వైఫల్యాలకు ప్రత్యక్ష నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఆ కారణంగానే ప్రతిపక్షాలు సామాన్య ప్రజల కష్టాలను సాకుగా చూపించి మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేయగలిగాయని చెప్పవచ్చు. అదే..నోట్ల రద్దు తరువాత నగదు కొరతను నివారించగలిగి ఉండి ఉంటే, ప్రతిపక్షాలు మాట్లాడేందుకు కూడా అవకాశమే ఉండేది కాదు. 


Related Post