సమావేశాలు కౌంటర్లు వేసుకోవడానికేనా?

December 22, 2016


img

కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కే.జానారెడ్డి నిన్న మంత్రి హరీష్ రావుని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన మాట అన్నారు. “సభలో సభ్యులు ఏదైనా ఒక విషయంపై మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దానిని పూర్తిగా విన్న తరువాతే మంత్రులు సమాధానం చెప్పాలి. అదే సాంప్రదాయం కూడా. కానీ మేమేదో చెపుతుంటే దానికి మీరు మద్యలో లేచి కౌంటర్ ఇస్తే, మళ్ళీ దానికి మేము కౌంటర్ ఇస్తే, ఇక సభలో అసలు విషయంపై చర్చ జరుగదు. దాని వలన ఎవరికీ ఒరిగేది ఉండదు విలువైన సభా సమయం వృదా అవడం తప్ప. కనుక అందరూ ప్రజా సమస్యలపైనే చర్చలు జరిగేలా వ్యవహరించాలి,” అని జానారెడ్డి అన్నారు. 

నిజానికి చట్టసభల నుంచి ప్రజలు ఆశించేది కూడా అదే కానీ సమావేశాలు మొదలవక మునుపే ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరుకున పెట్టాలి? దానిని ఏవిధంగా శాసనసభ సాక్షిగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి? అని ప్రతిపక్షాలు ఆలోచించి అందుకు తగ్గ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకొంటే, వాటి దాడి నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకొని మళ్ళీ ఎదురుదాడి చేయడానికి అధికార పార్టీ సభ్యులు సన్నధమై సమావేశాలు వస్తారు. ప్రజా సమస్యలపై చర్చ అనేది వారి యుద్దానికి ఒక సాకు మాత్రమే. కనుకనే అధికార, ప్రతిపక్షాలు సమావేశాలలో అసలు విషయాన్నీ పక్కన పెట్టి స్వోత్కర్ష, పరనిందలతో కాలక్షేపం చేసేసి మమ అనిపించేస్తాయి.

ఉదాహరణనకి నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకొనేవారు రోడ్డున పడే పరిస్థితి కనబడుతోంది. అలాగే కార్మికులు, వ్యవసాయ కూలీలు వంటి వారి పరిస్థితి దయనీయంగా మారింది. వందల కోట్లు టర్నోవర్ కలిగిన తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. వారందరి  సమస్యలపై శాసనసభ, మండలిలో లోతుగా చర్చించి, తాత్కాలిక పరిష్కారాలు కనుగొని వాటిని యుద్ద ప్రాతిపదికన  అమలుచేసేందుకు ప్రయత్నించి ఉండి ఉంటే బాగుండేది. కానీ సమావేశాలలో రోజుకొక అంశం లేదా ప్రజా సమస్య తీసుకొని దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు స్వంత డబ్బా కొట్టుకొంటూ, ఒకరిపై మరొకరు విమర్శించుకొంటూ కాలక్షేపం చేసేస్తుంటారు. 

అయితే కేవలం తెలంగాణా శాసనసభ, మండలిలోనే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో, చివరికి పార్లమెంటు సమావేశాలు కూడా ఇదే తీరుగా సాగుతున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక దేశంలో ఇతర రాష్ట్రాల శాసనసభా సమావేశాలు, పార్లమెంటు సమావేశాలతో పోలిస్తే మన రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు కొంతలో కొంత మేలనిపిస్తుంది. అందుకే సంతోషపడాలేమో!          



Related Post