అమ్మ కంటే చిన్నమ్మ ఇంకా స్పీడూ!

December 19, 2016


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనేక ఏళ్ళపాటు తీవ్ర కష్టనష్టాలు, అవమానాలు, సవాళ్ళని ఎదుర్కొని తన స్వయంశక్తితోనే ఆ స్థాయికి ఎదిగారు. కానీ ఆమె స్నేహితురాలు శశికళ ఎటువంటి సవాళ్ళు, కష్టాలు ఎదుర్కోకుండానే, కేవలం జయలలిత మృతి కారణంగానే పార్టీపై అధికారం, పట్టు సాధించగలగతం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

జయలలిత చనిపోగానే ఆమె అధికార నివాసమైన పోయెస్ గార్డెన్ లో శశికళ మకాం పెట్టేయడం చాలా తెలివైన చర్య అని చెప్పక తప్పదు. ముందు ఆ భవనాన్ని తన అధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆ ఒక్క చర్యతోనే ఆమె పార్టీపై చాలా సులువుగా పట్టు సాధించగలిగారని చెప్పవచ్చు. ఆ భవనంలో జయలలిత స్థానంలో నిలబడిన శశికళని చూసి అన్నాడిఎంకె  నేతలు, మంత్రులు ఆమెని ప్రశ్నించకపోగా ఆమెకి పూర్తిగా దాసోహం అయిపోయారు. 

జయలలిత మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా మంత్రులు, పార్టీలో సీనియర్ నేతలు పరుగున వచ్చి ఆమె ఇంటి గుమ్మం ముందు చేతులు కట్టుకొని నిలబడటమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జయలలిత ఏళ్ళ తరబడి కష్టపడి ఆ పదవి సంపాదించుకొంటే ఆమె ఆకస్మిక మరణం కారణంగానే శశికళ చాలా సులువుగా అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చేజిక్కించుకొబోతున్నారు. 

ఆమె దానితో సంతృప్తి పడుతుందని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం అనుకొంటే, ఆమె వారికి షాక్ ఇవ్వడానికి చాలా చురుకుగా పావులు కదుపుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో తన అనుకూల వర్గం నేతలు, మంత్రుల చేత ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అభ్యర్ధనలు చేయించుకొంటున్నారు. సుమారు 150 మందికి పైగా పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న పోయెస్ గార్డెన్ కి వచ్చి ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని శశికళని అభ్యర్ధించారు. అంటే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంని ఆ కుర్చీలో నుంచి దించేసి తను అధిష్టించడానికి ఆమె రంగం సిద్దం చేసుకొంటున్నట్లుగానే భావించవచ్చు. 

కనుక ముఖ్యమంత్రి కూడా తన కుర్చీని కాపాడుకోవడానికి పావులు కదపడం మొదలుపెట్టారు. జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్ధించే వంకతో ఆయన ఈరోజు డిల్లీ వెళ్ళబోతున్నట్లు తాజా సమాచారం. 

తమిళనాడు రాజకీయాలలో అడుగుపెట్టాలని కలలు కంటున్న భాజపా కూడా సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తోంది కనుక కేంద్రప్రభుత్వం పన్నీర్ సెల్వంకి అండగా నిలిచి శశికళకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేయవచ్చు. 


Related Post