భాజపా చేసింది నమ్మక ద్రోహమే: పవన్ కళ్యాణ్

December 19, 2016


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజుకొక అంశం తీసుకొని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏపికి ప్రత్యేక హోదా అనే అంశంపై స్పందిస్తూ “భాజపా తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై మాట తప్పింది. దానికి బదులు అది ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజి  కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. ఆ ప్రత్యేక ప్యాకేజీలో ‘ప్రత్యేక’ అనే పదం తప్ప మరే ప్రత్యేకత లేదు. ఒక దశాబ్ద కాలంపాటు ఆంధ్రులు అనేక అవమానాలు ఎదుర్కొన్న తరువాత రాజధాని లేకుండానే బయటకి గెంటివేయబడ్డారు. ఆంధ్రా ప్రజలని భాజపా చేతగాని వాళ్ళని భావిస్తున్నట్లుంది. జై ఆంధ్రా ఉద్యమం సందర్భంగా 400 మందికి పైగా విద్యార్ధులు కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. వారిపై ప్రాణాల సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనేవరకు భాజపా విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చేద్దాం,” అని పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ లో మెసేజ్ పెట్టారు. 

పవన్ కళ్యాణ్ చేస్తున్న ఒక్కో ట్వీట్ అతను భాజపాకి దూరం అవుతున్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే భాజపాపై ఆయన సందిస్తున్న విమర్శనాస్త్రాలను నిశితంగా గమనించినట్లయితే, దానిపై ఆగ్రహానికి కారణాలు అవేనా లేక రాజకీయ కారణాలు, ఆలోచనలు, ఉద్దేశ్యాలు ఏవైనా ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఆయన భాజపానే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు తప్ప దానికి మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్న తెదేపాను పల్లెత్తు మాట అనడం లేదు. 

ప్రత్యేక హోదా హామీ అమలు విషయంలో కేంద్రప్రభుత్వం మాట తప్పినా మాట వాస్తవమే. కానీ ఏపికి ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకి రెండేళ్ళ క్రితమే తెలుసని, అందుకే నిధుల కోసమే మాట్లాడుతున్నారని తెదేపా ఎంపి జెసి దివాకర్ రెడ్డి కుండబ్రద్దలు కొట్టినట్లు ఎప్పుడో చెప్పారు. అది నిజం కూడా. ప్రత్యేక హోదా రాదనే సంగతి తెలిసి ఉండి కూడా ఆ విషయం ప్రజలకి చెప్పకుండా, చంద్రబాబు, ఆయన మంత్రులు కూడా దాని కోసం కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నట్లు నటించారు. చివరికి ‘హోదా కంటే ప్యాకేజీయే బెస్టు’ అని కోరస్ పాడి ఆ అంశాన్ని ముగించేశారు. కనుక ఈ విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఆంధ్రా ప్రజలని మభ్యపెట్టాయని చెప్పక తప్పదు. కానీ  పవన్ కళ్యాణ్ తెదేపాని పల్లెత్తు మాటనకుండా కేంద్రప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు. 

ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తుంటారు తప్ప కేంద్రప్రభుత్వాన్ని పల్లెత్తుమాటనరు. ఎందుకంటే ఆయన లక్ష్యం దీని కోసం కేంద్రంతో గొడవ పడటం కాదు. ఏపిలో అధికారంలోకి రావడానికే ఆయన ఈ అంశం పట్టుకొని తెదేపాని మాత్రమే లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తున్నారు. 

కానీ పవన్ కళ్యాణ్ కి జగన్ లాగా ఏపికి తానే ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక కూడా లేదు. కనీసం తన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కోరిక తాపత్రయం కూడా కనబడదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపంతోనే ఆయన కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లయితే, చంద్రబాబు నాయుడుని కూడా విమర్శించి ఉండాలి. కానీ విమర్శించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ పోరాటం వెనుక కూడా వేరే కారణాలు, ఉద్దేశ్యాలు ఉన్నాయని అనుమానించక తప్పడం లేదు. అవేమై ఉండవచ్చు అంటే ఏపిలో భాజపా బలపడకుండా, తెదేపాకు ప్రత్యామ్నాయంగా ఎదగకుండా అడ్డుకోవడమేననిపిస్తుంది. అంతకంటే వేరే కారణాలు కనిపించడం లేదు. చంద్రబాబు రాష్ట్రంలో భాజపాని ఎదగకుండా అడ్డుకోవడానికే దానిపై పవన్ కళ్యాన్ని అస్త్రంగా సందిస్తున్నారా?  అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే రాజకీయాలలో రాణించాలనుకొన్నట్లయితే, ఆయన తన స్వంత విధానాల ప్రకారమే నడుచుకోవడం మంచిది లేకుండా చివరికి పులిహోరలో కరివేపాకు అయిపోయే ప్రమాదం ఉందని గ్రహిస్తే చాలా మంచిది.


Related Post