పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్!

December 17, 2016


img

భాజపా ప్రభుత్వాన్ని 5 అంశాలపై ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు వాటిలో 3వధైన దేశభక్తి అనే అంశంపై నిలదీశాడు. పాలకులు తమ దేశభక్తిని నిరూపించుకొనే ప్రయత్నాలు చేయకుండా సామాన్య ప్రజలకి ఎందుకు అగ్నిపరీక్షలు పెడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలాగే భాజపా విధానాలని వ్యతిరేకించే వారినందరినీ దేశద్రోహులు లేదా దేశభక్తి లేనివాళ్ళుగా ముద్రవేయాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా హాలుని కూడా దేశభక్తి నిరూపించుకోవలసిన వేదికగా మార్చడం తగదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 

పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటలలోనే...   

“ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీ ప్రజల కులం, మతం, జాతి, ప్రాంతం, బాష మొదలైన వాటన్నిటికీ అతీతంగా వ్యవహరించగలిగినప్పుడే నిజమైన దేశభక్తి ఏమిటనే అనుభూతి కలుగుతుంది. దేశభక్తి అనేది వ్యక్తుల మానవీయ విలువలలో ఇమిడి ఉంటుంది. దానిని అధికార పార్టీ అభిప్రాయాలతోనో  లేదా దాని విధానాలతోనో నిర్దారించడం సరికాదు. తమ విధానాలని వ్యతిరేకించేవారిని దేశద్రోహులుగా పరిగణించి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకొన్నా కూడా సహనంతో అవతలివ్యక్తి ఏమి చెపుతున్నారో ఆలకించాలి. బలవంతంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినట్లయితే జె.ఎన్.యు.విద్యార్ధుల విషయంలో జరిగినట్లే బ్యాక్ ఫైర్ అవవచ్చు.”

“ప్రజలు తమ కుటుంబ సభ్యులతోనో లేదా స్నేహితులతోనో సాయంత్రంపూట సరదాగా సినిమా చూడటానికి వెళితే, ఆ సినిమా హాలుని కూడా దేశభక్తికి ఒక పరీక్షా వేదికగా మార్చేశారు. ప్రజలకి దేశభక్తి గురించి పాఠాలు చెప్పేవారు మోదట తామే వాటిని ఎందుకు ఆచరించి చూపరు? పార్లమెంటు సమావేశాలు మొదలుపెట్టే ముందు జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించరు? అది సినిమా ధియేటర్లలోనే ఎందుకు అమలుచేస్తున్నారు? ఇటువంటి పరిణామాలని  చూస్తున్నప్పుడు ప్రముఖ అమెరికన్ ఆర్ధికవేత్త థామస్ సోవెల్ చెప్పిన మాట ఒకటి నాకు జ్ఞాపకం వస్తోంది. “మనం చట్టాన్ని నిజాయితీగల పౌరులకి ఒక బోనులాగా, మోసగాళ్ళకు బహుమానంగా తయారుచేసుకొంటున్నామా?” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ సందించిన ఈ ప్రశ్నలు కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి చేసినవేనని వేరేగా చెప్పనవసరం లేదు. ఇంతకంటే చాలా పెద్ద సవాళ్ళనే పట్టించుకొని పాలకులు ఇటువంటి ప్రశ్నలను పట్టించుకొంటారని ఆశించడం అవివేకమే అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తమని వ్యతిరేకిస్తున్నాడనే విషయం మాత్రం వారు బాగా అర్ధం చేసుకొంటారని చెప్పవచ్చు. 

అయితే ఇంతవరకు తెదేపా, భాజపా నేతలెవరూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ట్వీట్ దాడులపై స్పందించలేదు. మిగిలిన రెండు అంశాలు: ప్రత్యేక హోదా, నోట్ల రద్దు గురించి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలూ వ్యక్తం చేసిన తరువాత అన్నిటికీ కలిపి ఒకేసారి జవాబీయవచ్చు. పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ ప్రశ్నలు ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు పైగా “భాజపాని నేను శత్రువుగా పరిగణిస్తున్నాను” అని చాటుకొని దానిని యుద్దానికి ఆహ్వానిస్తున్నట్లవుతుంది. అంతే!     

దేశభక్తి గురించి చెప్పుకోవాలంటే, దేవాలయాలలో పూజారి కంటే ఆలయానికి వచ్చే భక్తులకే ఎక్కువ భక్తి కనిపించిన్నట్లుగా దేశభక్తి పాలకులలో కంటే సమాన్యులలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దేశం కోసం సామాన్య ప్రజలే ఎప్పుడూ ఎక్కువగా త్యాగాలు చేస్తుంటారు. కానీ పాలకులు, వారికి కొమ్ము కాస్తున్నవారే దేశానికి తీరని నష్టం కలిగిస్తుండటం చూస్తూనే ఉన్నాము. ఒక నిరుపేద రైతు ఒకటి రెండు లక్షలు బాకీలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకొంటే, విజయ మాల్యా వంటివారు వేలకోట్లు బాకీలు ఎగవేసి విదేశాలకి పారిపోతుంటారు. కానీ అటువంటి వారిని పాలకులు ఏమీ చేయకపోగా వారి బాకీలు  కూడా మాఫీ చేసి పడేసి ఆ భారం కూడా మళ్ళీ సామాన్యుడి నెత్తినే మోపుతుంటాయి. కనుక ముందుగా పాలకులే దేశభక్తిని వంటపట్టించుకొంటే దేశానికి, సామాన్య ప్రజలకి కూడా చాలా మేలు కలుగుతుంది. తమకి లేని దేశభక్తిని ప్రజలపై బలవంతంగా రుద్దడం అనవసరం...అవివేకం..అహంకారమేనని చెప్పక తప్పదు. 


Related Post