సమస్యలపై చర్చ ముఖ్యం కాదు వాగ్ధటే ముఖ్యమా?

December 17, 2016


img

శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్ అయిన తరువాత కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డికి శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావుకి సభలో చాలా ఆసక్తికరమైన వాగ్వాదం జరిగింది. వారి వాదోపవాదాలు విన్న తరువాత సభలో నుంచి కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ అయ్యారనే విషయం కంటే, ఇద్దరూ తమ వాదనలని ఎంత చక్కగా సమర్ధించుకొన్నారో అనే భావన కలుగక మానదు. వాటిలో వారిద్దరి రాజకీయ చతురత, మాటకారితనం కళ్ళకు కట్టినట్లు కనిపించింది.

జానారెడ్డి మాట్లాడుతూ "మీకు సభలో మెజార్టీ ఉంది కదాని..మేమే అధికారంలో ఉన్నాము కదా అని సభ మేము చెప్పినట్లుగానే జరగాలి..మేము కోరుకొన్న అంశాలపైనే సభలో చర్చ జరగాలి..ఎవరైనా ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకి పంపించేస్తామని బెదిరించడం..వాయిదా తీర్మానంపై చర్చ జరుపమని అడిగినందుకే మా పార్టీ సభ్యులని సభ నుంచి సస్పెండ్ చేయడం సరికాదు. సభ మొదలైన రెండు నిమిషాలకే మా వాళ్ళని ఏవిధంగా సస్పెండ్ చేస్తారు? అధికారం ఉంది కదా అనే అహంకారంతో వ్యవహరిస్తున్న మీరు ఆ స్థానంలో కూర్చోవడానికి కూడా అర్హులు కారు. ఒకవేళ ప్రతిపక్షాలు సభకి రాకూడదు..వచ్చినా ఎవరూ మాట్లాడకూడదు అంటే మేము ఇక సభకి రాము. మేము చెప్పేది మీరు వినడానికి ఇష్టపడనప్పుడు ఈ సభకి రావడం అనవసరం. ఇంతకంటే ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్యల గురించి మాట్లాడుకోవడం ఉత్తమం. మీ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే నేను కూడా నిరసనగా సభ నుంచి వాక్ అవుట్ చేస్తాను," అని అన్నారు.

ఆయనకి మంత్రి హరీష్ రావు చెప్పిన జవాబు ఇంకా అద్భుతంగా ఉంది. "శాసనసభ రెండు వారాలు కాదు 20 రోజులు జరుపాలని పట్టుబట్టేది మీరే. మళ్ళీ సభని ఒక్కరోజు కూడా జరుగకుండా అడ్డుకొనేది కూడా మీరే. మీరు లేవనెత్తిన సమస్యల గురించి 20 రోజులు కాదు నెలరోజులైన చర్చించడానికి మేము సిద్దంగా ఉన్నాము. అక్కడ డిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడతారు..ఇక్కడ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్నారు. నిన్న  సభలో మీరు మాట్లాడిన మాటలు విన్నప్పుడే మీపార్టీ సభ్యుల వద్ద సభలో మాట్లాడేందుకు బలమైన అంశం ఏమీ లేదని స్పష్టం అయ్యింది. సభలో నిన్న మాదే పైచెయ్యి అయినట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అవి చూసే మీరు సభలో చర్చ జరుగకుండా అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నారు."

"బిఎసి సమావేశంలో సభలో చర్చించవలసిన అజెండాని ఖరారు చేశాము. దానిలో మీరు ప్రస్తావిస్తున్న ఈ అంశం లేదు. అయినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయం తరువాత మీరు చెప్పిన అంశంపై చర్చిద్దామని స్పీకర్ చెపుతున్నా వినకుండా సభని స్తంభింప జేయాలని ప్రయత్నిస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా? రాష్ట్రానికి సంబంధించి అనేక ముఖ్యమైన సమస్యలపై సభలో చర్చ జరుగవలసి ఉంది. మీరు పదిమంది కలిసి సభని నడవనీయకుండా చేస్తే సభలో ఉన్న మిగిలిన 97మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడకుండా కూర్చోవాలా?"

"ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇదే సభలో తెలంగాణా అనే పదం పలికినందుకే సస్పెండ్ చేయలేదా? ఆనాడు ఇదే సభలో మేము తెలంగాణా గురించి మాట్లాడినందుకు ఆంధ్రా పాలకులు మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేస్తే మార్షల్ చేత సభ నుంచి మమ్మల్ని బరబరా బయటకు ఈడ్చుకుపోతుంటే జానారెడ్డి వంటి పెద్దలు చూస్తూ ఊరుకొన్నారు తప్ప ఇదేమి అన్యాయం అని ప్రశ్నించలేకపోయారు. ఈరోజు మేము మన తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ అడ్డుపడుతున్నారు. మీరు సభని హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకోము. సభని అడ్డుకోవాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోక తప్పదు," అని హరీష్ రావు జవాబు చెప్పారు.    


Related Post