ప్రజాప్రతినిధులకి జీతాల పెంపు?

December 17, 2016


img

తెరాస సర్కార్ ఈరోజు శాసనసభలో 9 బిల్లులు ప్రవేశపెట్టబోటోంది. వాటిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాభత్యాల పెంపుని ప్రతిపాదిస్తున్న బిల్లు కూడా ఒకటి. దీనిపై పార్టీలకతీతంగా శాసనసభ్యులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆమోదిస్తారని వేరే చెప్పనవసరం లేదు. శాసనసభలో అటువంటి బిల్లు ప్రవేశపెట్టడమే ఆలశ్యం దానికి తక్షణమే ఆమోదముద్ర పడుతుంటుంది. 

తెలంగాణా శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు దేశంలో అత్యధిక జీతాలు అందుకొంటున్న ప్రజా ప్రతినిధులు. ఈ ఏడాది మార్చి 29న వారి జీతాలు ఏకంగా 163 శాతం పెంచుకొంటూ ప్రవేశపెట్టిన బిల్లుని శాసనసభ ఆమోదించింది. తద్వారా ఒక్కో శాసనససభ్యుడి జీతంలో బేసిక్ పే రూ.12-20,000 వరకు పెరిగింది. ఇక అదిగాక నియోజకవర్గ అలవెన్సుల క్రింద ఇదివరకు రూ.83,000 అందుకొనేవారు. అది ఒకేసారి రూ.2,30,000కి పెరిగింది. ఇవన్నీ కలుపుకొని ఒక్కో ప్రజా ప్రతినిధికి సుమారు నెలకి రూ.2.5 లక్షలు పైనే జీతభత్యాలు అందుకొంటున్నారు. 

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ జీతం 72 శాతం పెంచుకొన్నారు. ఆయన నియోజకవర్గ అలవెన్సు గతంలో రూ. 83,000 ఉండగా అది ఏకంగా రూ.2.42 లక్షలకి పెరిగింది. రూ.16,000 ఉండే ఆయన బేసిక్ పే రూ.51,000కి పెరగింది.  అంతకుముందు ఇవన్నీ కలుపుకోగా ఆయనకి నెలకి రూ.2.44 లక్షలు జీతభత్యాలు అందుకోనేవారు. ప్రస్తుతం ఆయనకి నెలకి రూ.4.1 లక్షలు అందుకొంటున్నారు.  

ఇక శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ జీతభత్యాలు కూడా ఆ రెంజిలోనే పెంచుకొన్నారు. గతంలో వారు నెలకి రూ.2.42 లక్షలు జీతభత్యాలు అందుకొనేవారు. అది రూ.4.11కి పెరిగింది. మంత్రులు, చీఫ్ విప్ ల జీతాలు రూ.2.4 లక్షల నుంచి నెలకి రూ.4 లక్షలకి పెంచుకొన్నారు. 

ఇంత బారీగా జీతాల పెంపుపై వచ్చిన విమర్శలపై అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి మనదేశంలో ఆర్ధిక పరిస్థితులు వేరు..ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎవరూ త్యాగాలు చేయనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా జీతభత్యాలు అందుకొనే హక్కు ప్రజాప్రతినిదులకి ఉంటుంది, అని గట్టిగా సమర్ధించుకొన్నారు.

ఈ జీతాల పెంపు జరిగి సరిగ్గా నేటికి 8 నెలలు పూర్తి కాలేదు. మళ్ళీ జీతల పెంపుకి ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వం నేడు సభలో బిల్లు ప్రవేశ పెట్టబోతోంది. సాధారణంగా ఉద్యోగుల జీతాలు ఏడాదికి ఒకమారు మాత్రమే కొద్దికొద్దిగా పెరుగుతుంటాయి. కాంట్రాక్టు ఉద్యోగులకి ఆ అవకాశం కూడా ఉండదు. జీతాలు పెరగాలంటే రోడ్లెక్కి ధర్నాలు, నిరాహార దీక్షలు చేయవలసిందే. వారు చేసే పనికి తగిన జీతం ఇవ్వమంటే ప్రభుత్వానికి మనసొప్పదు. కానీ విలాసవంతమైన జీవితం గడిపే ప్రజాప్రతినిధులు త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. వారికి తగినంత జీతభత్యాలు ఈయవలసిందే అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతారు.   

రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట కాంట్రాక్టు కార్మికులు లేదా మరొకరో నిత్యం తమ జీతాలు పెంచమని కోరుతూ రోజుల తరబడి నిరాహారదీక్షలు, ర్యాలీలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోదు. అలాగే విద్యార్ధులు తమ ఫీజ్ రీ-ఎంబర్స్ మెంట్ చెల్లించమని రోడ్లెక్కి ర్యాలీలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీలు చేసేస్తామని చెప్పిన తెరాస రెండున్నరేళ్ళ తరువాత కూడా ఇంకా వాటిని పూర్తిగా మాఫీ చేయలేకపోయింది. ఈ సమస్యలన్నిటిపై ప్రతిపక్షాలే ఇప్పుడు శాసనసభ, మండలిలో పోరాటాలు చేస్తున్నాయి కూడా.

ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించవలసిన ప్రభుత్వం మొట్టమొదట రైతులు, కార్మికులు, విద్యార్ధులకి మానవతాదృక్పదంతో ఆదుకోవాలి కానీ వారికి చెల్లింపులు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తుంటుంది. ఒక మంత్రివర్గ సమావేశం, ఒక శాసనసభ సమావేశంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంచుకొంటుంది. ప్రతీ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రతిపక్షాలు కూడా జీతాల పెంపు విషయంలో ప్రభుత్వానికి ‘సై’ అంటాయి. వెంటనే అందరి జీతాలు అమాంతం పెరిగిపోతాయి. ప్రపంచంలో ఏ సంస్థలో కూడా పనిచేసే ఉద్యోగులే తమ జీతాలు పెంచుకొనే వెసులుబాటు లేదు కానీ మన దేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి మాత్రమే ఆ వెసులుబాటు ఉంది. ఎప్పుడు ఎంత కావాలనుకొంటే అంతా పెంచేసుకోవచ్చు. పండుగలకి, పబ్బాలకి ఖరీదైన బహుమతులు తమకి తామే ఇచ్చేసుకోవచ్చు.

ఈరోజు శాసనసభలో ఈ జీతాల పెంపు బిల్లుతో బాటు జిల్లాల పునర్విభజన బిల్లు, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్ధిపేట పోలీస్ కమీషనరేట్స్ ఏర్పాటుకి బిల్లు, రాష్ట్ర బిసి కమీషన్ చట్టసవరణ బిల్లు, రాష్ట్ర పురపాలక, నగరాభివృద్ధి సంస్థల చట్ట సవరణల కోసం బిల్లులు, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం బిల్లులని ప్రవేశ పెడతారు. 


Related Post